అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనతో దూసుకుపోతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కానీ అభ్యర్థులను ప్రకటించే చంద్రబాబు ఈసారి రాబోయే ఎన్నికల్లో రూట్ మార్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల మెుదటి జాబితా విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. 

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 80 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఫైనలైజ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కడప జిల్లా అభ్యర్థుల ఎంపికప ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో పాగా వెయ్యాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. మెుదటి నుంచి కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు జిల్లాలో దాదాపు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

కడప పార్లమెంట్ అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణరెడ్డిని ఖరారు చేశారు. అయితే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పులివెందుల నుంచి సతీష్ రెడ్డి, జమ్మల మడుగు నుంచి రామసుబ్బారెడ్డిని ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. 

అలాగే రాయచోటి నుంచి రమేష్‌కుమార్‌రెడ్డి, రాజంపేట నుంచి బత్యాల చెంగల్రాయుడు, రైల్వేకోడూరు నుంచి టి.నరసింహప్రసాద్‌(చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు )ను ఎమ్మెల్యేలుగా బరిలో దింపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. 

ఇకపోతే మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని బరిలో దించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్‌కు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. కమలాపురం సీటు విషయానికి వస్తే పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరశివారెడ్డినే అభ్యర్థిగా ఖరరా చెయ్యనున్నారని తెలుస్తోంది. 

అటు బద్వేల్‌ అసెంబ్లీ విషయానికి వస్తే లాజరస్‌ పేరును పరిశీలిస్తున్నారు. లాజరస్ ను మాజీఎమ్మెల్యే విజయమ్మ తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే అభ్యర్థులను ఫైనలైజ్ చేసిన చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. 

గురువారం మధ్యాహ్నాం మరోసారి కడప జిల్లా టీడీపీ నేతలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికను ఫైనలైజ్ చెయ్యనున్నారు. గురువారం సమావేశంలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే కడప జిల్లా టీడీపీ అభ్యర్థుల జాబితా రేపో ఎల్లుండో ప్రకటించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. 

పార్లమెంట్ స్థానాలు 2
1. కడప పార్లమెంట్- ఆదినారాయణరెడ్డి
2. రాజంపేట- పెండింగ్..

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
1. పులివెందుల-సతీష్ రెడ్డి
2. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి
3. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
4. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
5. రైల్వే కోడూరు- టి.నరసింహ ప్రసాద్ (చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు)
6. మైదుకూరు- డీఎల్ రవీంద్రారెడ్డి ( త్వరలో టీడీపీలో చేరనున్నారు)
7. ప్రొద్దుటూరు- పుట్టా సుధాకర్ యాదవ్ 
8. కమలాపురం- వీర శివారెడ్డి
9. బద్వేల్-లాజరస్
10. కడప- అష్రఫ్(మాజీమంత్రి అహ్మదుల్లా తనయుడు)