కడప జిల్లాలోని వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (IIIT Idupulapaya) మరోసారి విద్యార్థుల ఆందోళనతో అట్టుడికింది. క్యాంపస్‌లో విధ్యార్థులు మరోసారి ధర్నాకు దిగారు. ఓల్డ్ క్యాంపస్ వద్ద పీ1, పీ2 విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కడప జిల్లాలోని వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (IIIT Idupulapaya) మరోసారి విద్యార్థుల ఆందోళనతో అట్టుడికింది. క్యాంపస్‌లో విధ్యార్థులు మరోసారి ధర్నాకు దిగారు. ఓల్డ్ క్యాంపస్ వద్ద పీ1, పీ2 విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమకు వసతులు కల్పించాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. సక్రమమైన వసతులు లేని పాత క్యాంపస్‌లో ఉండేది లేదంటూ ఆందోళన చేపట్టారు. అయితే విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. వారు బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఇక, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆదివారం సాయంత్రం పీ1, పీ2 కోర్సులు చదువుతున్న విద్యార్థులు నిరసన తెలియజేశారు. ఆర్కే వ్యాలీలోని పాత క్యాంపస్‌కు వెళ్లాలని ఆదేశించడానికి నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ డైరెక్టర్ కె సంధ్యా రాణి శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం నెలకొందని విద్యార్థులు తెలిపారు. 3 నెలలుగా కొత్త క్యాంపస్‌లో ఉంటున్నామని.. రాత్రికి రాత్రే లగేజీ, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో పడేసి పాత క్యాంపస్‌కు తరలించారని వాపోయారు. విశ్రాంతి గదులు సరిగా లేకపోవడం, తలుపుల్లేని మరుగుదొడ్లు, ఇతర వసతులు లేవని... దీనివల్ల శనివారం రాత్రంతా నిద్ర కూడా లేదని ఆవేదన చెందారు.
ఆందోళనకు దిగిన విద్యార్థులపై డైరెక్టర్ కే సంధ్యారాణి (K Sandhya Rani) ఆగ్రహం వ్యక్తం చేశారని విద్యార్థినులు తెలిపారు. ఈ క్రమంలో ధర్నాలో కూర్చున్న ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే విద్యార్థులు తీవ్ర నిరసన తెలిపారు. అయితే వెనక్కి తగ్గని డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి... ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులంతా వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని... లేదంటే పోలీసుల సాయంతో బలవంతంగా పపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇందుకు సంబంధించి కొందరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో వారు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే క్యాంపస్‌లో ఆదివారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే నిరసన మానుకోవాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ హెచ్చరించినా.. తాము పట్టించుకోలేదని విద్యార్థినులు తెలిపారు. ఇక, విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఆర్జీయూకేటీ ఛాన్స్‌లర్ కె చెంచురెడ్డి... సమస్యలు శాశ్వతం కాదన్నారు. త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.
