కడప స్టీల్ ఫ్యాక్టరీకి త్వరలోనే పర్యావరణ అనుమతులు: జగన్
కడప జిల్లాలో త్వరలోనే మరిన్ని పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
కడప:త్వరలోనే కడప స్టీల్ ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతి రానుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్స్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారంనాడు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఒబెరాయ్ హోటల్ నిర్మాణంతో గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్నారు. గండికోట ప్రపంచఖ్యాతిగాంచిన ప్రదేశంగా సీఎం జగన్ గుర్తు చేశారు.
స్టార్ గ్రూప్ ల రాకతో గండికోట అంతర్జాతీయ మ్యాప్ లోకి వెళ్తుందన్నారు. ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. గండికోటకు మరో స్టార్ గ్రూప్ ను కూడ తీసుకువస్తామని సీఎం జగన్ తెలిపారు.
also read:గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు జగన్ శంకుస్థాపన
కొప్పర్తి డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం జగన్ చెప్పారు. కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు ఎంఓయూలు చేసుకుంటామని సీఎం జగన్ వివరించారు. స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాపులోకి తీసుకెళ్తున్నామన్నారు సీఎం జగన్. గండికోటలో గోల్ఫ్ కోర్సును కూడ ఏర్పాటు చేయాలని ఒబెరాయ్ గ్రూప్ సంస్థలను సీఎం కోరారు. ఒబెరాయ్ వంటి పెద్ద కంపెనీలు గండికోటకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గండికోట, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లో ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్స్ ను నిర్మిస్తున్నట్టుగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ లో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామంగా సీఎం జగన్ పేర్కొన్నారు. ఒబెరాయ్ గ్రూప్ సంస్థలు, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పంద పత్రాలను ఈ సందర్భంగా మార్చుకున్నారు.