ఇక్కడ విషయమేమిటంటే, ఓట్ల పరంగా తీసుకుంటే టిడిపి కన్నా వైసీపీకే బలం ఎక్కువ. జిల్లాలోని 845 ఓట్లలో వైసీపీ ఓట్లు 521.

స్ధానిక సంస్ధల కోటాలో కడప ఎంఎల్సీ స్ధానాన్ని గెలవటం చంద్రబాబునాయుడుకు సవాలుగా మారింది. కర్నూలు, నెల్లూరు జిల్లాల పరిస్ధితి ఎలాగున్నా కడపలో గనుక గెలిస్తే వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టినట్లేనన్నది టిడిపి మాట. కాకపోతే, స్ధానిక సంస్ధల ఓట్లలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అదే ఇపుడు అధికారపార్టీకి నిద్రపట్టకుండా చేస్తోంది. అందుకే కడపపై చంద్రబాబు ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారు. కడప గెలుపు విషయంలో చంద్రబాబు చూపుతున్న ప్రత్యేకశ్రద్ధకు తాజా ఘటనే ఉదాహరణ.

ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చంద్రబాబు సోమవారం నంద్యాలకు వెళ్లారు. నంద్యాలకు ప్రత్యేక విమానాంలో విజయవాడలో బయలుదేరిన సిఎం ముందుగా కడప విమానాశ్రయంలో ఆగారు. విమానంలోనే సుమారు గంటసేపు మంతనాలు జరిపారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అభ్యర్ధి బిటెక్ రవి, ఫిరాయింపు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి, కడప పార్టీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంఎల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు. గెలుపుకు అవసరమైన సూచనలు చేసారు.

ఇక్కడ విషయమేమిటంటే, ఓట్ల పరంగా తీసుకుంటే టిడిపి కన్నా వైసీపీకే బలం ఎక్కువ. జిల్లాలోని 845 ఓట్లలో వైసీపీ ఓట్లు 521. పైగా రెండు పార్టీలు వివిధ చోట్ల క్యాంపులు నడుపుతున్నాయి. టిడిపి ఎంత ప్రయత్నించినా వైసీపీ ఓట్ల నుండి పెద్దగా స్పందన కనబడటం లేదని సమాచారం. ఈ పరిస్ధితుల్లోనే వైసీపీ ఓట్లను ఏ విధంగా లాక్కోవాలో అర్ధం కావటం లేదు టిడిపి శిబిరానికి. అదే విషయాన్ని చంద్రాబాబుకు స్ధానిక నేతలు వివరించారట. క్యాంపుల్లో ఉన్న ఓటర్లను లాక్కోలేకపోతే పోలింగ్ రోజున ఏమన్నా అవకాశాలుంటాయేమో చూడాలని నేతలు అనుకున్నట్లు సమాచారం. పరిస్ధితులు ఎలాగున్న కడప సీటును గెలవటం ఎంతముఖ్యమో చంద్రబాబు నేతలకు స్పష్టంగా చెప్పారట. దాంతో ఏం చేయాలో బోధపడక నేతలందరూ తలలు పట్టుకుంటున్నారు.