మతభోదకుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కేఏ పాల్ నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజాశాంతి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటుచేసి ఇప్పటికే తలలు పండిన రాజకీయ నాయకులతో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని మెజారిటీ సామాజిక వర్గాలపై కన్నేశారు. ఈ క్రమంలో మొదటిసారిగా కేఏ పాల్ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రకటించి సంచలనం రేపారు. 

వంగవీటి రాధా తన బంపరాఫర్ ను కాదని తెలుగు దేశం పార్టీలో చేరడంపై స్పందిస్తూ పాల్ సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకువచ్చారు. తాను రాధా సామాజిక వర్గమైన కాపు కులానికి చెందినవాడినే అంటూ ప్రకటించారు.  కానీ ఓ దళిత వర్గానికి చెందిన మహిళను పెళ్లాడి  వారి కోసం ఇంతకాలం పని చేశానని వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితమే తనతో కొందరు కాపు నేతలు సమావేశమయ్యారని...వంగవీటి రాధాను టిడిపిలో చేరకుండా ఆపాలంటు తనను కోరారని పాల్ తెలిపారు. అందువల్లే  ఆయన్ని ఆపడానికి ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి లేదంటే  రూ.100  కోట్లు ఆఫర్ చేసినట్లు పాల్ పేర్కొన్నారు. కానీ దాన్ని కాదని టిడిపిలో చేరడానికి సిద్దమైన  రాధాపై పాల్ మండిపడ్డారు

 తన తండ్రిని చంపించిన పార్టీలో చేరతూ రాధా తప్పు చేస్తున్నారని అన్నారు. టిడిపికి అమ్ముడిపోయిన రాధాను కాపు సమాజం ఎన్నటికీ క్షమించబోదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.