గుండు కొట్టించుకున్న పవన్ కల్యాణ్ కావాలా? గుండు గీసే ఈ కాపు కావాలా?: కేఏ పాల్ సంచలనం
ప్యాకేజి స్టార్ పవన్ వెనకాల ఉంటారో లేక తనతో పాటు ఉంటారో కాపులే తేల్చుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సూచించారు.

విజయవాడ : కొద్దిరోజులు తెలంగాణలో సందడిచేసిన కేఏ పాల్ మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పోటీ చేస్తుందని పాల్ ప్రకటించినా ఎన్నికల సంఘం మాత్రం దాన్ని గుర్తింపు పొందిన పార్టీగా పరిగణించలేదు. దీంతో చేసేదేమీ లేక తెలంగాణ ఎన్నికల నుండి తప్పుకున్న కేఏ పాల్ మళ్ళీ ఏపీ రాజకీయాలపై పడ్డారు. నిన్న విశాఖపట్నంలో, ఇవాళ విజయవాడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
విజయవాడ బందరు రోడ్డులోని కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కాపులంతా తనవైపు రావాలని కోరారు. రాష్ట్రంలో 29 శాతం వున్న కాపులకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నానని అన్నారు. అయితే ఇప్పుడున్న పవన్ కల్యాణ్ లాంటి కాపు నాయకులతో అది సాధ్యం కాదని కేఏ పాల్ అన్నారు.
ఇప్పటికే ప్యాకేజ్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.1000 కోట్లకు కాపులను టిడిపికి అమ్మేసాడని పాల్ ఆరోపించారు. అలాగే టిడిపితో పొత్తు నాటకమాడుతూ 30 సీట్లను రూ.1500 కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. 2009 లో తన అన్న చిరంజీవి కాపులను నిలువునా ముంచేసారని... ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ అలాగే చేస్తున్నాడని కేఏ పాల్ అన్నారు. రంగా ఆశయాలను సాధించాలనుకునే కాపులెవరూ టిడిపితో గానీ... దాంతో జతకట్టిన జనసేనతో కానీ వుండరన్నారు.
Read More జగన్ రెడ్డీ... ఏం చేసినా ఇప్పుడే... 5 నెలల తర్వాత నువ్వుండవు.. : అచ్చెన్నాయుడు సంచలనం
ప్యాకేజి స్టార్ పవన్ వెనకాల ఉంటారో లేక తనతో పాటు ఉంటారో కాపులే తేల్చుకోవాలని అన్నారు. గతంలో ప్రత్యర్థుల చేతిలో గుండు గీయించుకుని అవమానాలపాలైన పవన్ లాంటి కాపులు కావాలా లేక గుండు గీసే తనలాంటి కాపులు కావాలా? అంటూ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాపులు ఎన్నాళ్లుగానో కలలు కంటున్న రాజ్యాధికారం తీసుకువచ్చే బాధ్యత నాది... కేవలం మీరంతా మద్దతుగా నిలిస్తే చాలని కేఏ పాల్ అన్నారు.
ప్రస్తుతం రాజకీయంగా కాపుల పరిస్థితి చూసి వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు. రంగా గురించి ఆలోచించే కాపులేవరూ టీడీపీలో ఉండకూడదన్నారు. కన్న తండ్రిని చంపిన వారితో ఉంటారో లేక తనతో ఉంటారో వంగవీటి రాధ తేల్చుకోవాలని కేఏ పాల్ అన్నారు.