జగన్ రెడ్డీ... ఏం చేసినా ఇప్పుడే... 5 నెలల తర్వాత నువ్వుండవు.. : అచ్చెన్నాయుడు సంచలనం
జగన్ రెడ్డి... మీకు ఇంకా 5 నెలలే సమయం ఉంది... మా నాయకులపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ అచ్చెన్న సవాల్ విసిరారు.

అమరావతి : తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీస్ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయకుడు లోకేష్ తో సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారు పోలీసులు. చంద్రబాబుతో పాటు కొందరు ప్రతిపక్ష నాయకులపై కేవలం కేసులు కాదు జైల్లో కూడా పెట్టింది వైసిపి ప్రభుత్వం. ఇలా రాజకీయ కక్షసాధింపుతోనే తమ నాయకులపై జగన్ సర్కార్ కేసులు బనాయిస్తోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా టిడిపి నాయకులపై వరుస కేసులు వివాదంగా మారుతున్నవేళ మరో నేతపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేయడం సంచలనంగా మారింది.
టిడిపి సీనియర్ నాయకుడు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సంగం డెయిరీ వద్ద తనపై దాడి జరిగిందంటూ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంకు చెందిన రాము చేబ్రోలు పోలీసులను ఫిర్యాదు చేసాడు. డెయిరీ వద్దకు పిలిచి తనను కర్రలు, హాకీ స్టిక్స్ తో కొట్టారంటూ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఇలా సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల పేరుకు కూడా ఈ హత్యాయత్నం కేసు ఎఫ్ఐఆర్ లో చేర్చారు చేబ్రోలు పోలీసులు.
ఇలా ధూళిపాళ్లపై నమోదయిన హత్యాయత్నం కేసుపై ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ లిస్ట్ కన్నా వైసిపి ప్రభుత్వం టిడిపి నాయకులు, సామాన్యులపై పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేసారు. జగన్ సర్కార్ వైఫల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.
Read More చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల జప్తుకు సిఐడి సిద్దం ... నేడు కోర్టు ఏమంటుందో చూడాలి?
అరాచక పాలన వెలగబెడుతున్న ఈ నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టించారు... ఏం చేయగలిగారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు? అని మండిపడ్డారు. రాష్ట్రంలోని పాడిరైతుల ప్రగతికి కృషిచేసే నరేంద్ర రైతుపై దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా? అని అన్నారు.
గతంలో సంగం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది... అవి ఫలించకపోవడంతోనే ఇప్పుడు కేసుల పేరిట వేధింపులకు తెరతీసారని అన్నారు. దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. జగన్ రెడ్డి... మీకు ఇంకా 5 నెలలే ఉంది... ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ అచ్చెన్న సవాల్ విసిరారు.
వైసిపి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు... వచ్చే ఎన్నికల్లో వాళ్ళే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రం నుంచి వైఎస్ జగన్ తో పాటు వైసిపి నాయకులను తన్ని తరిమేయడం ఖాయమని అచ్చెన్నాయుడు అన్నారు.