ఏపీలో జరిగిన ఎన్నికలపై చాలా అనుమానాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు. ఈ ఎన్నికలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అనైతికమైనవని... కుట్రపూరితమైనవని ఆయన ఆరోపించారు.

బుధవారం దేశరాజధాని ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పరిశీలకులకు దక్షిణాది అధికారులను కాకుండా, ఉత్తరాధి అధికారులను నియమించడంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. దక్షిణాది అధికారులు నమ్మకస్తులు కాదా అని ప్రశ్నించారు. ఈసీపై పోరాటానికి రెండు, మూడు నెలలుగా ప్రణాళిక రూపొందించామన్నారు.

కపిల్ సిబాల్ నేతృత్వంలో పనిచేస్తున్నామని.. మూడోదశ  పోలింగ్ పై నిషేధం విధించాలనే డిమాండ్ తో ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి, యూఎస్ లకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. దేశంలో జరుగుతున్న ఎన్నికలను పరిశీలించాల్సిందిగా కోరామని ఆయన చెప్పారు.

బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే వరకు పోరాటం సాగిస్తామన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి తామంతా ఐక్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.