ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. దేశంలో జరిగిన ఎన్నికలు అవినీతితో కూడిన ఎన్నికలంటూ ధ్వజమెత్తారు. ఓ మీడియా చానెల్ తో మాట్లాడిన ఆయన ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే ఈవీఎంలలో అక్రమాలు జరిగినట్లేనని చెప్పుకొచ్చారు. 

చాలా చోట్ల ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పడిందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీకి చెందిన బీఫామ్ లు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఈ సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని తాను ఏనాడో చెప్పానని స్పష్టం చేశారు. 

ఏపీలో 30 అసెంబ్లీ నియోకజవర్గాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తాను చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు చంద్రబాబు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లు లెక్కించాలని కోరితే ఈసీ స్పందించలేదన్నారు. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని సుప్రీంకోర్టు న్యాయవాదులు చెబుతున్నారని పాల్ గుర్తు చేశారు. ఇకపోతే కేంద్రంలో బీజేపీ వచ్చే ఛాన్స్ లేదన్నారు. 

బీజేపీకి 200 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మమత బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్, మాయావతిలు కీ రోల్ పోషించబోతున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తోందని కేఏ పాల్ స్పష్టం చేశారు.