హ్యూస్టన్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా తాను లక్షల కోట్లు దోచుకోలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏపాల్ స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం అమెరికాలో ఆయన నివాసం ఉంటున్న హ్యూస్టన్ నుంచి ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన నివాసం ఉంటున్న ఇంటిని చూపించారు. తాను వైఎస్ జగన్ లా, చంద్రబాబు నాయుడులా విలాసవంతమైన భవనాల్లో ఉండటం లేదని కేవలం ఒక కర్రలతో నిర్మించిన పూరిగుడెసలో ఉంటున్నట్లు తెలిపారు. 

తనను చూసిన ప్రతీ ఒక్కరూ అమెరికాలో విలాసవంతమైన లైఫ్ గడుపుతున్నానని అనుకుంటున్నారని కానీ అది తప్పు అన్నారు. ప్రజలకు తెలియజెయ్యాలనే తాను లైవ్ లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. తాను నివాసం ఉంటున్న ఇళ్లు పురాతనమైనది కావడంతో వర్షం వస్తే నీరు కారుతోందని, బూజు పట్టేసిందన్నారు. 

తాను నిర్మించుకోవాలంటే పెద్ద ఇల్లు నిర్మించుకోగలనని చెప్పుకొచ్చారు. తనలాగే అమెరికాలో సుమారు 30 లక్షల మంది ఇండియన్స్ ఉంటారని తెలిపారు. అందులో ఎవరికి ఇలాంటి ఇళ్లు ఉండదన్నారు. తన ఇంటి విలువ సుమారు 60వేల డాలర్లు ఉంటుందన్నారు. 

సీఎం చంద్రబాబునాయుడు రూ. 6 లక్షల కోట్లు, వైఎస్ జగన్ రూ.3 లక్షల కోట్ల దోచుకున్నారని తాను మాత్రం అలా కాదన్నారు. తాను ఇచ్చే ఒక్క స్పీచ్ కి ఒక్క మిలియన్ డాలర్లు వస్తే ఆ సొమ్మును నరసాపురం ఎన్నికల్లో ఖర్చుపెట్టేసినట్లు తెలిపారు. 

అవి సరిపోకపోవడంతో తన స్నేహితుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రమాజీమంత్రి కపిల్ సిబల్ తనను అమెరికా పంపించారని రాజకీయ అంశంపై వివరాల కోసం వచ్చినట్లు తెలిపారు. కొద్ది గంటల్లోనే తాను ఇండియా వచ్చేస్తున్నట్లు తెలిపరాు. ఈనెల 23న ఢిల్లీలో మంచి కార్యక్రమం చేపడుతున్నానని అందుకు అంతా హాజరుకావలని కోరారు కేఏ పాల్.