అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్ జితేంద్ర కుమార్ మహేశ్వరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ జేకే మహేశ్వరిని ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ కేంద్రన్యాయ శాఖ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు విభజన అనంతరం 2019, జనవరి 1 నుంచి సీనియర్ న్యాయవాది చాగరి ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

 

జనవరి నెల నుంచి ఇప్పటి వరకు ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరిని నియమించడంతో ఇకపై సీనియర్ న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు ప్రవీణ్ కుమార్.

ఇకపోతే జస్టిస్‌ జేకే మహేశ్వరి 1961 జూన్‌ 29న జన్మించారు. 1985 నవంబర్‌ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 

2005 నవంబర్‌ 25న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈపదవిలో 2023 జూన్‌ 28 వరకు కొనసాగనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారానికి సీఎం వైయస్ జగన్ తోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.