అమరావతి: మాజీ ఎమ్మెల్సీ, ఎసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇవ్వనున్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. ఇందుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో జూపూడి ప్రభాకర్ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే, వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసిపి మీద, వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, సామాజిక నేపథ్యం దృష్ట్యా జూపూడి ప్రభాకర్ రావును పార్టీలో చేర్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ కూడా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. ఆయన ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూపూడి ప్రభాకర రావుతో పాటు ఆకుల సత్యనారాయణ వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం వైసిపిలో చేరే అవకాశం ఉంది. 

జగన్ ను కలిసి వారిద్దరు వైసిపిలో చేరుతారు. ఆ తర్వాత తమ వారు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ, జనసేన పార్టీల నేతలు పలువురు అటు బిజెపిలోనో, ఇటు వైసిపిలోనో చేరడానికి సిద్ధపడుతున్నారు.