పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. నిన్నటి వరకు టీడీపీ ముఖ్యనేతగా కొనసాగిన ఆయన మంగళవారం ఉదయం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ... జగన్ ఆలోచన, ప్రభుత్వ పనితీరు తనకు ఎంతగానో నచ్చిందని అందుకే వైసీపీ లో చేరినట్లు చెప్పారు. 10 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారని జూపూడి పేర్కొన్నారు. దళితులకు,గిరిజన,మైనార్టీలకు సీఎం పెద్ద పీట వేశారని పేర్కొన్నారు.

నిర్దిష్ట ఆలోచన సరళి లేని మేము గొర్రెల్లగా పక్కదారి పట్టామని.. అందరితో చేరి తాను కూడా టీడీపీలో చేరానని చెప్పారు.జగన్ మోహన్ రెడ్డిలో ఫెడరల్ కాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు. సీఎం జగన్ పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.

పదవులు ఆశించి పార్టీ మారలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం సైనికుడిలా నేను వైసీపీలో చేరానని చెప్పారు. రాజకీయంగా నావైపు జరిగిన కొన్ని తప్పులను సరిదిద్దుకుంటానని తెలిపారు. 

ఇదిలా ఉండగా..గతంలో జూపూడి ప్రభాకర్ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే, వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసిపి మీద, వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, సామాజిక నేపథ్యం దృష్ట్యా జూపూడి ప్రభాకర్ రావును పార్టీలో చేర్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జూపూడితోపాటు ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.