Konaseema: ప్రజాస్వామ్యంలో ప్రజలు బానిసలు కాదని జ‌న‌సేన నాయ‌కుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని కులాలను ఏకం చేయడానికి కట్టుబడి ఉన్నామనీ, ఇదే స‌మ‌యంలో ఏ ఒక్క‌ సామాజికవర్గం మద్దతుతో చిల్లర రాజకీయాలకు పాల్పడటానికి వ్యతిరేకమని జనసేన పార్టీ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. 

Jana Sena Party president Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డికి బానిసలు కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశావహులను పోటీ నుంచి తప్పుకునే వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బానిసలు కాదనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలన్నారు. 'ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని (జగన్ మోహన్ రెడ్డి) ద్వేషించను. మీరు బాగా పాలించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. ప్రశాంతంగా ఉన్న గోదావరి ప్రాంతంలో వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తే పులివెందుల రాజకీయాలను మా విప్లవ భావజాలంతో తిప్పికొడతాం'' అని అన్నారు.

పశ్చిమగోదావరిలోని న‌ర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో స‌మావేశం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల అభివృద్ధితోపాటు కాలుష్య నివారణకు మాస్టర్‌ ప్లాన్ తీసుకొస్తామనీ, విద్య, వైద్యం అంద‌రికీ అందేలా చూస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్దిని తీసుకురావ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్య‌మ‌నీ, జనసేన మార్పుకోసం వచ్చిందనీ, ఈ విష‌యంలో వెన‌క్కిత‌గ్గే ప్ర‌శ్నే లేదన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా అధికార‌పార్టీ వైకాపాకి రాకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని పునరుద్ఘాటించారు. 

ఇక కోన‌సీమ‌లో యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఏ ఒక్క సామాజికవర్గం మద్దతుతో చిల్లర రాజకీయాలు చేయకుండా అన్ని వర్గాలను ఏకం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో చమురు, సహజవనరుల దోపిడీపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం గోదావరి ప్రాంతంలోని (కృష్ణా-గోదావరి బేసిన్) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీల్లో ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.

"ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్, వేదాంత సంస్థలు మన ప్రాంతంలో (కేజీ బేసిన్) చమురు, సహజవాయువు వనరులను అన్వేషిస్తున్నాయి. నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయనే కారణంతో ఈ కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తాను. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే స్కిల్ డెవలప్ మెంట్ కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తామ‌ని" పవన్ కళ్యాణ్ తెలిపారు.