చిత్తూరులో జరిగిన జల్లికట్టు లో జూనియర్ ఎన్టీఆర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. తమిళనాడుకు రాహుల్ గాంధీ వెళ్లినట్టు చిత్తూరుకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్ కాదు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో ఆయన అభిమానులు సందడి చేశారు. పోట్లగిత్తల కొమ్ములకు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టి.. మురిసిపోయారు. 

ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే చాలు అభిమానుల గుండెల్లో రక్తం ఉప్పొంగి పోట్ల గిత్తల్లా ఉరకలు పెడతారు. ఇక ఆ పోట్ల గిత్తలకే ఆయన ఫోటో కడితే ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. 

అదేంటో చూపించాలనుకున్నారేమో.. జల్లికట్టు వేడుకలలో పాల్గొనే పోట్లిగిత్తలను అందంగా ముస్తాబు చేసే క్రమంలో కొన్నిటి కొమ్ములకు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే, జల్లికట్టును చూసేందుకు యువత భారీగా తరలివచ్చింది. పోట్లగిత్తల కొమ్ములు వంచటానికి కుర్రకారు ఆసక్తి చూపారు. బ్రాహ్మణపల్లి, నెమలిగుంటపల్లి, ఉప్పులవంక, గంగిరెడ్డిపల్లి, యాపకుప్పం, చంద్రగిరి, చానంబట్ల, పాతచానంబట్ల, చవటగుంట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జల్లికట్టును తిలకించటానికి విచ్చేశారు.