Asianet News TeluguAsianet News Telugu

ఆధ్రజ్యోతి మీడియాను బహిష్కరించిన వైసీపీ

రాజకీయ పార్టీలు బాగానే ఉంటాయి. మీడియా యాజమాన్యాలూ బాగానే ఉంటాయి. వాటి మధ్య ఉన్న వైరంలో విలేకరులే నలిగిపోతున్నారు.  రాజకీయ పార్టీలకు వత్తాసుగా మీడియాలో చీలికరావటంతో విలేకరులకు వృత్తిపరమైన స్వేచ్చ లేకుండా పోతోంది.

Journalists fall victim of politics of media houses

రాజకీయ పార్టీలు, మీడియా యాజమాన్యాల మధ్య వైరంలో విలేకరులు నలిగిపోతున్నారు. తాజాగా ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి విలేకరులను బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఇకనుండి పార్టీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు పై మీడియాకు చెందిన విలేకరులను ఆహ్వానించకూడదని నిర్ణయించినట్లు సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమవేశంలోనే ప్రకటించటం గమనార్హం.

ఇదే విధమైన నిర్ణయాన్ని గతంలో టిడిపి కూడా తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో వార్తలు వస్తుండటంపై చంద్రబాబునాయుడుకు కోపం వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న తమపై ఉద్దేశ్యపూర్వకంగానే సాక్షి కథనాలు ఇస్తున్నట్లు చంద్రబాబుతో పాటు నేతలు కూడా మండిపడేవారు. అంతేకాకుండా చంద్రబాబు మీడియా సమావేశాలతో పాటు ట్రస్ట్ భవన్లో నిర్వహించే నేతల సమావేశాలకు సాక్షి మీడియా నుండి విలేకరులను ఎవరినీ ఆహ్వనించకూడదని నిర్ణయించారు. అప్పటి నుండి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.

ఇపుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీడియాను బహిష్కరించటం సాధ్యం కాదు. కాబట్టి సాక్షి మీడియా నుండి ఎవరు ఏ ప్రశ్న వేసినా చంద్రబాబునాయుడు సమాధానాలు చెప్పరు. పైగా ప్రశ్నించిన వారిని అవమానకరంగా మాట్లాడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే.

తాజా విషయానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్రమోడిని జగన్ కొద్ది రోజుల క్రితం కలిసారు. ఆ విషయమై చంద్రబాబుతో పాటు మంత్రులు జగన్ పై మండిపడుతున్నారు. అయితే, ప్రధానిని జగన్ కలిసిన విషయంపై ఈరోజు ఆంధ్రజ్యోతి పతాక శీర్షికలో ఓ కథనం ప్రచురించింది.

ఆ కథనంపైనే వైసీపీ మండిపడుతోంది. తప్పుడు వార్తలు రాస్తున్నందుకు ఆంధ్రజ్యోతి తరపున విలేకరులను ఎవరినీ తమ సమావేశాలకు పిలవకూడదని నిర్ణయించుకున్నట్లు భూమన ప్రకటించారు. ఉద్దేశ్యపూర్వకంగానే టిడిపికి మద్దతుగా తమ అధినేతపై బురదచల్లే విధంగా కథనాలు ప్రచురిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే, రాజకీయ పార్టీలు బాగానే ఉంటాయి. మీడియా యాజమాన్యాలూ బాగానే ఉంటాయి. మధ్యలో విలేకరులే నలిగిపోతున్నారు.  రాజకీయ పార్టీలకు వత్తాసుగా మీడియాలో చీలికరావటంతో విలేకరులకు వృత్తిపరమైన స్వేచ్చ లేకుండా పోతోంది. యాజమాన్యాలకు అనుగుణంగా విలేకరులు వార్తలు రాయాల్సింది వస్తోంది. రాయకపోతే యాజమాన్యాలు ఊరుకోవు. రాస్తే రాజకీయ పార్టీలు ఒప్పుకోవటం లేదు. దాంతో విలేకరులకు చచ్చే చావు వస్తోంది.  ప్రస్తుతం ‘మీడియా స్వేచ్చ అంటే ఇపుడు యజమాన్యాల స్వేచ్చ అయిపోయింది’. ఈ విషయాన్ని  ఏ రాజకీయ పార్టీ కూడా గ్రహించటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios