నెల్లూరు:జిల్లాలోని  పెన్నానది ఒడ్డున కరోనాతో మరణించిన మూడు మృతదేహాలను పూడ్చిపెట్టిన ఘటనపై నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు.రాష్ట్రంలోని శ్రీకాకుళం, తిరుపతిలలో జేసీబీలతో కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

నెల్లూరు జిల్లాలో కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్ లో మూడు మృతదేహాలను తీసుకొచ్చి పెన్నా నది ఒడ్డును పూడ్చిపెట్టినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడు మృతదేహాలను తీసి జేసీబీలో విసిరేశారు. ఓ గుంట తీసి పూడ్చివేశారు. పెన్నానది ఒడ్డున మృతదేహాలను పూడ్చి వేయడంపై  స్థానికులు మండిపడుతున్నారు.

also read:నిజామాబాద్‌లో ప్రభుత్వాసుపత్రిలో కలకలం: ఒకే రోజూ కరోనాతో నలుగురు మృతి

ఈ వీడియో జిల్లా  జాయింట్ కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఈ ఘటన విషయంలో విచారణ అధికారిగా నెల్లూరు ఆర్డీఓ నియమించారు. ఈ విషయమై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నట్టుగా ఆర్డీఓ తెలిపారు.

కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల నిర్వహణ విషయంలో అనేక ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కరోనా రోగి అంత్యక్రియలు నిర్వహించిన పారిశుద్య సిబ్బందిని కాలనీలోకి రాకుండా అడ్డుకొన్నందుకు 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.