మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో చోటు దక్కించుకున్న కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రమేశ్.. తొలి రెండు సంతకాలను రెండు కీలక అంశాలకు చెందిన ఫైళ్లపై చేశారు.
వైసీపీ (ysrcp) సీనియర్ నేత, కృష్ణా జిల్లా (krishna district) పెడన (pedana) ఎమ్మెల్యే జోగి రమేశ్ (jogi ramesh) శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అమరావతిలోని సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రమేశ్.. తొలి రెండు సంతకాలను రెండు కీలక అంశాలకు చెందిన ఫైళ్లపై చేశారు. విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్ళు కట్టించే అంశంపై తొలి సంతకం చేసిన రమేశ్.. గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇచ్చే 90 బస్తాల సిమెంట్‌ను 140 బస్తాలకు పెంచుతూ రెండవ సంతకం చేశారు.
ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై (ys jagan) ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్ అభినవ పూలే అని, అంబేద్కర్ అసలైన వారసుడు అంటు కొనియాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ప్రతి గ్రామంలో పేద ప్రజలు ఆయనకు కష్టాలు చెప్పుకున్నారని జోగి రమేశ్ వివరించారు. ఆ కష్టాలను చూసే ఈ రోజున పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పేదలకు సంతృప్తినిచ్చే పద్ధతిలో ఇళ్లు కట్టిస్తున్నామని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక గుర్తింపు ఇస్తున్నారని జోగి రమేశ్ చెప్పారు. మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రమేశ్‌కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తదితరులు అభినందనలు తెలిపారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన (ap cabinet reshuffle) సంగతి తెలిసిందే . 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. అటు వీరికి మద్ధతుగా అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలు గరం గరంగా వున్నాయి.
