సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

వివరాల్లోకి వెళితే.. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అధికారుల పొరపాటు కారణంగా ఆయన రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.

చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్‌కు బదులుగా మధ్యప్రదేశ్ అని రాసి ఉండటంతో ఆయన అలాగే ప్రమాణం చేశారు. గవర్నర్, చీఫ్ జస్టిస్ సైతం మధ్యప్రదేశ్ అనే చదివారు.

అయితే జరిగిన పొరపాటును గుర్తించి మరోసారి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి సీఎం వైఎస్ జగన్ సహా, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.