అశోక్ లేల్యాండ్ మాకు వాహనాలు అమ్మకపోతే అసలు ఈ స్కామే లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పందించారు.

బీఎస్-3 వాహనాలను మోసపూరితంగా బీఎస్-4 వాహనాలుగా రిజిస్ర్టేషన్ చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జేసీ ప్రబాకర్ రెడ్డితో పాటు అతని సహచరులు, వారితో సంబంధం ఉన్న కంపెనీలకు చెందిన రూ.22 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ బుధవారం వెల్లడించింది. అయితే ఈ పరిణామాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అశోక్ లేల్యాండ్ తమకు వాహనాలు అమ్మకపోతే అసలు ఈ స్కామే లేదని అన్నారు.
ఈ స్కామ్‌లో అశోక్ లేల్యాండ్ పాత్రపై కూడా విచారణ చేస్తామని ఈడీ చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు అశోక్ లేలాండ్‌తో పాటు, తాడిపత్రి ఆర్టీఏ అధికారులు, నాగాలాండ్‌లోని ఆర్టీఏ అధికారుల మొత్తం కథ బయటకు వస్తుందని అన్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు చాలా మంది పోలీసులు కూడా ఇందులో ఇరుక్కుంటారని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసిన జాబితాలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ రోడ్ లైన్స్, జటాధర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, తాడిపత్రికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డికి చెందిన సి.గోపాల్ రెడ్డి అండ్ కంపెనీకి చెందిన ఆస్తులు ఉన్నాయి. వీటిలో నగదు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆభరణాలు తదితర చరాస్తులు రూ.6.31 కోట్లతోపాటు రూ.15.79 కోట్ల విలువైన 68 స్థిరాస్తులు ఉన్నాయని ఈడీ తెలిపింది.
అదే సమయంలో ఈ కేసులో చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అశోక్ లేలాండ్ పాత్రను కూడా విచారిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.