సినీ పరిశ్రమ గురించి చేతులు జోడించి వేడుకున్న చిరంజీవి గారిని చూస్తూ ఏడుపొచ్చిందంటూ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బాధపడ్డారు. పవన్ కల్యాణ్ మీద జగన్ కక్ష సాధింపు చర్యలు ఆపాలని కోరారు..
తాడిపత్రి : సినీ పరిశ్రమపై కక్ష సాధింపులు వద్దని.. అలా చేసి ఏం సాధిస్తారని.. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ JC Prabhakar Reddy ప్రశ్నించారు. తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం film industryకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదేవిధంగా ప్రోత్సహిస్తే అక్కడ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. కక్ష సాధింపు చర్యలు వల్ల andhrapradeshలో సినీపరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది. అంతే కానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎమ్మార్వోలు, పోలీసులు.. అంతా కలిసి Movie theatersపై పడ్డారు.
లా అండ్ ఆర్డర్ ను పోలీసులు మర్చిపోయారు. జనసేన అధినేత Pawan Kalyan నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కోరారు. కేటీఆర్ హాజరవడంతో పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఈగో ఉంటుంది. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వారికి ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు. ఇది రాష్ట్ర మనుగడకు మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు. సత్తా ఉన్నవారు. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.
జగన్ కేనా ఈగో ఉండేది…
‘పవన్ పై కక్ష సాధింపు ద్వారా సాధించేది ఏమిటి? ఏ సినిమా తీసిన ఆయన రెమ్యూనరేషన్ ఆయనకు వస్తుంది ఏదైనా ఉంటే నేరుగా తేల్చుకోండి. సీఎం జగన్ తీసుకున్న చర్యల వల్ల పవన్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. జగన్ కేనా ఈగో ఉండేది.. ఈగో అందరికీ ఉంటుందని తెలుసుకోవాలి. వీలుంటే మంచి పనులు చేసి.. ప్రజల మెప్పు పొందాలి. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు ఆపాలి. సిబిఐ అధికారుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఉండకూడదా? ఈరోజు నేను చెబుతున్నా… ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ కి వచ్చి షూటింగ్ చేయరు.
చిరంజీవి గారిని చూస్తే ఏడుపొచ్చింది. కింది స్థాయి నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి ఆయన. దీనాతి దీనంగా చేతులు జోడించి మిమ్మల్ని అడిగారు. ఆ పరిస్థితి ఎవరికి రావద్దు. చిరంజీవి సైతం మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయ పడాలా? ఆయనకు ఏం తక్కువ. చేతులు జోడించి అడిగారంటే ఆయన బతుకు తెరువు కోసం కాదు. ఆయనను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం అడిగారు. నిన్ను ఎవరు క్షమించడం లేదు.. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధిస్తే థియేటర్ వద్ద పల్లీలు అమ్మే వ్యక్తి నుంచి వరకు అందరూ నాశనమైపోతారు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
