తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతోంది. నిన్నంతా కార్యాలయంలోనే వుండి రాత్రి అక్కడే పడుకున్న ఆయన ఉదయం కూడా స్నానం కార్యాలయ ప్రాంగణంలోనే చేశారు.
అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది వ్యవహారశైలికి నిరసనగా మున్సిపల్ ఛైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతోంది. సోమవారం(నిన్న) సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ముందుగానే సమాచారమిచ్చినా అధికారులెవ్వరూ రాకపోవడంతో జేసి తీవ్ర అసహనం చేశారు. దీంతో రోజంతా మున్సిపల్ కార్యాలయంలోనే వున్న ఆయన రాత్రి కూడా కార్యాలయంలోనే పడుకున్నారు. ఇక ఇవాళ(మంగళవారం) కూడా ప్రభాకర్ రెడ్డి తన నిరసన కొనసాగిస్తూ మున్సిపల్ కార్యాలయంలో స్నానం చేశారు.
తాడిపత్రిలో వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ నెల 2వ తేదీన అంటే నిన్న సోమవారం మున్పిపల్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయమై శనివారం నాడే జేసీ ప్రభాకర్ రెడ్డి కమిషనర్ సహ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సోమవారం నాడు అదే సమయానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి నగరంలో కరోనా వైరస్ మూడో దశపై అవగాహన ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. దీంతో అధికారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
చివరకు ఎమ్మెల్యే నిర్వహించిన కరోనా అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ ర్యాలీ పూర్తి కాగానే అధికారులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే ఈ ర్యాలీ పూర్తయ్యాక అధికారులు వస్తారని మున్సిపల్ కార్యాలయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురు చూశారు. అయినప్పటికి అధికారులెవ్వరూ రాకపోవడంతో ఆయన రోజంతా అక్కడే బసచేశారు.
read more వంగి నమస్కారం:అధికారుల తీరుపై జేసీ నిరసన, కార్యాలయంలోనే బస
మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వకుండానే సెలవుపై వెళ్లడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ వచ్చేవరకు మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని ఆయన నిరసనకు దిగారు.
అధికారులు వచ్చేవరకు తాను మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కొందరు అధికారులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగానే వారికి వంగి వంగి నమస్కరించి జేసీ ప్రభాకర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీసం ముందుగా సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ఎలా వెళ్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు రాత్రి భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.మంగళవారం ఉదయం కూడా ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలోనే స్నానం చేశారు.
