జేసీ తిక్కకు లెక్కుందా..? ఊరందరిదీ ఒక దారైతే ‘‘జేసీ’’ది ఇంకోదారా..?

jc diwakar reddy sensational comments effects on politics
Highlights

మనసులో ఉన్న విషయాన్ని ఎవ్వరికి భయపడకుండా.. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేసే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విలక్షణ రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవ్వరూ చెప్పినా వినని నైజంతో పలు సందర్భాల్లో వివాదాలను ఏరికోరి తెచ్చుకున్నారు జేసీ

మనసులో ఉన్న విషయాన్ని ఎవ్వరికి భయపడకుండా.. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేసే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విలక్షణ రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవ్వరూ చెప్పినా వినని నైజంతో పలు సందర్భాల్లో వివాదాలను ఏరికోరి తెచ్చుకున్నారు జేసీ. పట్టిన పట్టు వీడకపోవడం.. తన మాటలను సమర్ధించుకోవడం ఆయనకే చెల్లింది. దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన జేసీ.. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం ఎంపీ అయ్యారు.

ఎక్కడున్నా తన వాదనను వెరైటీగా వినిపించే దివాకర్ రెడ్డి టీడీపీలోనూ అలాగే ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రిపైనే విమర్శలు చేసేవారు.. ‘‘ చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని.. అందుకు చాలా అంశాలు దోహదం చేశాయని.. ఆయన పిలిస్తే  జనం రావడానికి చంద్రబాబు ఏమీ మహాత్మాగాంధీ కాదని కుండబద్ధలు కొట్టారు. అధికారులతో పాలన సాగించవద్దని తాను గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి చెప్పానని అన్నారు.. పయ్యావులనే పట్టించుకోవడం లేదు.. ఇక నా పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని పార్టీలో ఉన్న స్థితిని బాహాటంగానే వెళ్లగక్కారు.

ఇక మొన్నటికి మొన్న కడపలో స్టీల్ ఫ్లాంట్ కోసం సొంత పార్టీ ఎంపీ సీఎం రమేశ్ నిరాహారదీక్ష చేసిన సంగతి తెలిసింది.. సంఘీభావం తెలిపేందుకు కడపకు వచ్చిన జేసీ.. ‘‘ నా మిత్రుడు సీఎం రమేశ్‌ దీక్ష చేస్తున్నాడని వచ్చిన నేను.. ఆయన్ను అభినందించేందుకు మాత్రం రాలేదు. రమేశ్‌.. ఎందుకు నాయనా.. ఈ నిరాహార దీక్ష..! నా మాట విను. ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు..? ఉక్కు పరిశ్రమ కాదు కదా..? కనీసం తుక్కు పరిశ్రమ కూడా రాదని’’ సభా ముఖంగా చెప్పడంతో టీడీపీ శ్రేణులు నిర్ఘాంతపోయాయి.

ఇక జగన్‌ను కూడా వదిలిపెట్టలేదు..‘‘ జగన్‌ను సార్ అని పిలవాలట.. ఏం పోయే కాలం వచ్చిందో మా వాడికి.. తెలివైనవాడే కానీ ఎవ్వరి మాట వినడు.. వాడి బుర్రకు తట్టిందే తప్ప.. రాజశేఖర్ రెడ్డి పరిస్థితి జగన్‌కు లేదు అంటూ విమర్శించారు జేసీ.  ఇక తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి హిట్ కొట్టింది టీడీపీ. అలా ఫుల్  జోష్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీకి జేసీ మళ్లీ షాకిచ్చారు.

ప్రభుత్వం పడిపోనప్పుడు రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరగనప్పుడు ఎందుకీ వృధా ప్రయాస అన్న దివాకర్ రెడ్డి.. విప్ జారీ చేసినా పార్లమెంట్ గుమ్మం తొక్కను అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం కలిగించాయి. ఆయన వైఖరి ప్రతిపక్ష వైసీపీకి అనుకూలంగా మారాయి. మీ పార్టీ ఎంపీనే సభకు హాజరుకానప్పుడు విప్ జారీ చేసినా పోనని చెప్పడంతో బీజేపీతో కుమ్మక్కు వ్యవహారం కాక మరేంటి అంటూ వైసీపీ నేతలు టీడీపీని విమర్శిస్తున్నారు.. 

loader