అనంతపురం: సూటిగా మాట్లాడి సంచలనం సృష్టించే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన సొంత పార్టీవారిపైనే విరుచుకుపడ్డారు.  మంత్రులు, టీడీపి ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలని వ్యాఖ్యానించారు. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వడని, ఇచ్చినా తనను తట్టుకోలేడని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్‌ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలిసిందని ఆయన అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా పనికిరాని వెధవలు కావడం వల్లనే ప్రభుత్వ పథకాలు సరిగా అమలుకాలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన్న బీమా పథకం ఒక్కటే బాగుందని కితాబు ఇచ్చారు. ఈ విషయాన్ని ధైర్యంగా సీఎంకు చెప్పే ధైర్యం ఎవరికీలేదన్నారు. 

రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ఎవరికి ఉపయోగమో అర్థం కావడంలేదని జెసి అన్నారు. రేషన్‌ షాపుల్లో కొనుగోలు చేసే బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని చెప్పారు.  

"నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు, ఇచ్చినా తట్టుకోలేడు. సీఎం వల్ల నాకు ఏ విధమైన ప్రయోజనం కలుగలేదు. నేను మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్లంతా నా దగ్గర పనిచేశారు" అని అన్నారు.