విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వస్తే చాలు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రెచ్చిపోతారు. తాజాగా ఆయన మరోసారి జగన్ పై తీవ్రమైన వ్యాఖ్య చేశారు.

జగన్ మనోగతం ఇదేనని  జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. జగన్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే విషయాన్ని చెప్పారు. జగన్ నూటికి నూరు శాతం బీజేపీతో కలిసి వెళ్తారని చెప్పారు. సీఎం చంద్రబాబు మరో ఐదేళ్లు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 

కైకలూరులోని ఎంపీ మాగంటిబాబు నివాసంలో సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం మాట తప్పిందని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్రంలో అందరూ మాట్లాడుతున్నారని, కానీ జగన్‌ మాత్రం స్పందించడం లేదని అన్నారు.
 
కోస్తా జిల్లాల్లో కోడిపందాల కోలాహలం కొనసాగుతాయి. గత యేడాది కూడ కృష్ణా జిల్లాలోని కలిదిండి మండలం తాడినాడలో జరిగిన కోడి పందాలకు ఎంపీలు దివాకర్ రెడ్డి, మాగంటి బాబు పాల్గొన్నారు. స్వయంగా పోటీలను వారు తిలకించారు. చెరో కోడి పుంజును చేతితో పట్టుకుని పైకెత్తి చూపిస్తూ ఎంపీలు అక్కడివారిలో జోష్ నింపారు.