జెసి బ్రదర్స్...కొత్తగా పరిచయం అవసరం లేని ప్రజా ప్రతినిధులు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎక్కడున్నా ఒకే పంథాలో కొనసాగుతుంటారు. కరువు జిల్లా అనంతపురంలో అప్రతిహతంగా సాగిపోతున్న జెసి బ్రదర్స్ వైఖరి తాజాగా జిల్లాలోనే కాకుండా పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏంటి? అంటే, అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు సొంత పార్టీ నేతల్లోనే కలవరం పుట్టిస్తోంది. పార్టీ నేతల వరకూ ఓకే అనుకుంటే అక్కడితో ఆగలేదు. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే తలనొప్పులు తెస్తున్నారు. దాంతో జెసె సోదరులను ఎలా నియంత్రించాలో అర్ధంకాక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.

జెసి సోదరులతో పార్టీలో రెండు రకాల సమస్యలు వస్తున్నాయి. ఎంసి దివాకర్ రెడ్డేమో ముందూ వెనకా చూసుకోకుండా నోటికెంత వస్తే అంత మాట్లాడేస్తుంటారు. ఒకసారి వైసిపి జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడతారు. ఇంకోసారి జగన్ మావాడే అంటారు. అదే పద్దతిలో చంద్రబాబునాయుడును నోటికొచ్చినట్లు ఇప్పటి వరకూ తిట్టలేదు కానీ సైటైర్లకు,  విమర్శలకైతే కొదవేలేదు. పోలవరం గురించి చంద్రబాబు వ్యాఖ్యలకు విరుద్దంగా ఎన్నోసార్లు మాట్లాడారు. పార్టీ విధానాల గురించి చాలాసార్లు బాహాటంగా తప్పుపట్టారు. సహచర నేతల గురించి చేసిన వ్యాఖ్యలకైతే అంతే లేదు. జిల్లా టిడిపిలలో ఎటుచూసినా కమ్మ వాళ్ళ ఆధిపత్యమే కనబడుతోందంటూ బహిరంగంగా సైటైర్లు వేయటం ఒక్క దివాకర్ రెడ్డికే చెల్లింది.

ఇక, ప్రభాకర్ రెడ్డిది మరోదారి. ఆయనకు నోరుతో పాటు చేతి వాటమూ ఎక్కువే. ఎదుటి వాళ్ళపై కోపమొస్తే ఇక నోటికి పనిచెప్పేయటమే ఎంఎల్ఏకి తెలిసింది. కోపమొస్తే ఎదుటి వాళ్ళపై చేయి కూడా చేసుకుంటారు. తాజాగా తాడిపత్రి పోలీసుస్టేషన్లో జరిగిందదే. తన మద్దతుదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే పూనకమొచ్చేసింది. అంతే వెంటనే పోలీస్టేషన్ కు వెళ్లిపోయి పోలీసులనే బండబూతులందుకున్నారు. దాదాపు కొట్టినంత పనిచేసారు. పోలీస్టేషన్లోనే పోలీసులపైకే దాడి చేయటానికి వెళ్ళిన ఎంఎల్ఏ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ప్రభాకర్ రెడ్డి మాత్రమే. ఇవన్నీ చాలవన్నట్లుగా అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరితో పాటు చాలామంది నేతలతో ప్రత్యక్షంగా గొడవలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీకి తలనొప్పిగా మారిన జెసి బ్రదర్స్ ను చంద్రబాబు ఏ విధంగా నియంత్రిస్తారో చూడాల్సిందే.