కర్నూలు: ఏపీ మంత్రి గుమ్మనూర్ జయరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన జయరామ్ సీఎం వైయస్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు రూ.50 కోట్లు డబ్బు, ఒక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని అయితే దాన్ని సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. 

రూ.50 కోట్లు, మంత్రి పదవి నా వెంట్రుకతో సమానం అంటూ తిప్పి పంపిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. డబ్బుకు అమ్ముడుపోకుండా నీతిగా నిలిచినందుకే వైయస్ జగన్ తనను మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. 

తాను నీతిగా ఉంటూ తన సామాజిక వర్గమైన బోయలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చానంటూ మీసం మెలేశారు. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి వంటి వాళ్లు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి టీడీపీలో చేరిపోతే తాను మాత్రం చేరలేదని మంత్రి జయరామ్ చెప్పుకొచ్చారు. ఇకనైనా బోయ సామాజిక వర్గం నేతలు మారాలని వైయస్ జగన్ ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి జయరామ్ సూచించారు.