అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజాతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సమాచార కమీషనర్లను నియమించింది. తాజాగా ఐలాపురం రాజాను సమాచార కమిషనర్‌ నియామకానికి గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఐలాపురం రాజాతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రమాన స్వీకారం చేయించారు. 

అనంతరం సమాచార కమిషన్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఏ శాఖలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని ఆరా తీశారు. ఇకపోతే ఐలాపురం రాజాను సమాచారహక్కు చట్టం కమిషనర్ గా నియమించడంపై జన విజ్ఞాన వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. 

రాజా నియామకంపై హైకోర్టును ఆశ్రయించింది. రాజా నియామకాన్ని నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అనంతరం ఈనెల 29కి విచారణ వాయిదా వేసింది.