Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ యువతకు అండగా జనసేన... రేపు నిరసనలకు పవన్ పిలుపు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండరుపై ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలుస్తుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

janasena supports unemployed youth protest for jobs... pawan kalyan akp
Author
Amaravati, First Published Jul 19, 2021, 5:45 PM IST

విజయవాడ: రాష్ట్రంలోని 30లక్షల మంది నిరుద్యోగ యువత అయోమయ స్థితిలో వున్నారని... నయవంచనకు గురయ్యామనే వేదన వారందరినీ కలచి వేస్తున్నట్లు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.  వైసీపీకి చట్టసభలో 151మంది ఎమ్మెల్యేల భారీ మెజారిటీ  దక్కడంలో ఆ 30 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రధాన కారణమన్నారు. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ ఇచ్చిన హామీని విశ్వసించి నిరుద్యోగ యువత మొత్తం ఆ పార్టీకే అండగా నిలిచి గెలిపించారని పవన్ పేర్కొన్నారు. 

''యువత పుణ్యాన భారీ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చి... రెండేళ్ల తరవాత కేవలం 10వేల ఉద్యోగాలు ఇస్తామనడంతో యువతను వంచించడమే. ఎక్కడ రెండున్నర లక్షల ఉద్యోగాల హామీ... ఎక్కడ పది వేల ఉద్యోగాల భర్తీ. ఇలా నిరుద్యోగ యువత వంచనకు గురై రోడ్డున పడ్డామనే ఆవేదనతో, నిరాశా నిస్పృహలతో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండరుపై ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలుస్తోంది'' అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

''జనసేన పార్టీ మంగళవారం అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్ మెంట్ అధికారి కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ నిరుద్యోగ యువత పక్షాన వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ అంశంపై సోమవారం పవన్ వీడియో సందేశం విడుదల చేశారు.

read more  రాజకీయ నిరుద్యోగులకేనా ఉద్యోగాలు... యువతకి వద్దా జగన్ రెడ్డి గారు?: నారా లోకేష్
 
''రెండున్నర లక్షల ఉద్యోగాల హామీని నిరుద్యోగ యువత నమ్మింది. 30 లక్షల మంది యువతీయువకులు ఉద్యోగాల కోసం ఆశగా చూస్తున్నారు. పోలీసు విభాగంలో 74వేల ఉద్యోగాలు ఉన్నాయని గుర్తించి బడ్జెట్ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏటా 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండరులో 460 పోస్టులే చూపించారు. పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకొని సిద్దమవుతున్న యువతీయువకుల పరిస్థితి ఏమిటి?'' అని ప్రశ్నించారు. 

''25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న లక్షల మంది ఆ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యారు. అసలు ఉపాధ్యాయ ఉద్యోగాల ఊసే లేదు. రెండు వేల వరకూ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్లో 34 పోస్టులు మాత్రమే ప్రకటించారు. 30 లక్షల మంది అర్హులు ఉంటే 34 ఉద్యోగాలా?'' అని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

''పట్టు బట్టలు, బంగారం ఇవ్వక్కరలేదు. చక్కటి భవిష్యత్ ఇవ్వండి చాలు. తమ పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు, కొత్తకొత్త పదవులు సృష్టించి ఉపాధి కల్పించిన వైసీపీ ప్రభుత్వం... ఉన్న ఉద్యోగాలను ఎందుకు ఇవ్వడం లేదు... తమ పార్టీ వారిపై ఉన్న శ్రద్ధ, హామీ ఇచ్చిన 2.5 లక్షల ఉద్యోగాలపై ఎందుకు లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం చేపడుతుంది. జన సైనికులు, నాయకులు నిరుద్యోగ యువతను కలుపుకొని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీల దగ్గరకు వెళ్ళి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 2.5 లక్షల ఉద్యోగాల హామీని గుర్తు చేస్తూ వినతి పత్రాలు అందచేస్తారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుంది'' అని మరోసారి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios