నిర్భయ దోషులకు శుక్రవారం తెల్లవారుజామున తీహార్ జైల్లో ఉరి తీశారు. నేరం చేసిన ఎనిమిది సంవత్సరాల తర్వాత దోషులకు శిక్ష పడింది. అయితే.. ఇలా ఒకేసారి నలుగురు దోషులను ఉరితీయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా.. వీరి ఉరిశిక్షపై జనసేన పార్టీ నేతలు స్పందించారు.

నిర్భయను అత్యంత దారుణంగా హతమార్చిన నలుగురిని ఉరితీసిన శుక్రవారం ఉదయం అత్యంత గొప్పదని జనసేన పార్టీ అభివర్ణించింది. అయితే.. వారిని బహిరంగంగా ఉరితీసి ఉంటే బాగుండేదని... అలా చేయడం వల్ల సమాజంలో కొంచమైనా మార్పు వచ్చే అవకాశం ఉండేదని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

Also Read అశాంతితో నిర్భయ దోషులు: నిద్రపోలేదు, తినలేదు, స్నానానికి నిరాకరణ...

మానవమృగాలకు మరణశిక్షపడిన రోజు ఒక గొప్ప సూర్యోదయం అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు.లాయర్లు చేసిన పోరాటాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పారు. దిశ చట్టం తెచ్చిన ఏపీ సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఆయేషామీరా,సుగాలిప్రీతిల విషయంలోను న్యాయం చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. 

రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది.