టీడీపీ గోదావరి జిల్లా ప్రజలను మోసం చేసిందని  పవన్ ఆరోపించారు. పార్టీలు అధికారాన్ని రెండు వర్గాలుగా విడిపోయి పంచుకుంటున్నాయి కానీ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు

గత ఎన్నికల్లో తాను ఒక్క మాట చెప్పినందుకు.. గోదావరి జిల్లా ప్రజలు టీడీపీకి 15సీట్లు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అయినా కూడా టీడీపీ గోదావరి జిల్లా ప్రజలను మోసం చేసిందని పవన్ ఆరోపించారు.

పవన్ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉంటుందన్నారు. తనకు గోదావరి జిల్లాలతో చిన్ననాటి జ్ఞాపకాలు తక్కువే అయినప్పటికి రాజకీయ పరంగా బంధం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

భీమవరం శివారున పెదఅమిరం ఎన్‌డీ కల్యాణ మండపంలో నవయుగ జనసేన పేరుతో సేవా కార్యక్రమాలు చేసే యువతరంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఉన్న పార్టీలు అధికారాన్ని రెండు వర్గాలుగా విడిపోయి పంచుకుంటున్నాయి కానీ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. జిల్లాలో అన్ని సీట్లు తెలుగుదేశం గెలిచినప్పటికీ సమస్యలు పట్టించుకోకపోవడం భాధ కలిగిస్తోందన్నారు.