దుర్గ గుడిలో అవినీతి  రాజ్యమేలుతోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. దుర్గ గుడిలో దండుపాళ్యం గ్యాంగ్ తిరుగుతోందన్నారు. దుర్గగుడి ఈఓ సురేష్ బాబు, మంత్రి వెల్లంపల్లి కలిసి అవకతవకలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

"

దుర్గగుడి అక్రమాలపై ఎసిబి దాడులు మూణ్నాళ్ల ముచ్చటేనా అని ప్రశ్నించారు. ఎసిబి దాడులు చేసి చిన్న ఉద్యోగులను తొలగించారు.. కానీ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డ వారిని వదిలేస్తారా అని ప్రశ్నించారు. 

దుర్గ గుడి ఈఓగా సురేష్ వచ్చిన తరువాత ఇంద్రకీలాద్రిపైకి సరుకుల కోసం 50కోట్లు చెల్లించారు. కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ కు పిలవాలి కదా.. ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించారు. 

దుర్గ గుడిలో కాంట్రాక్టు వర్కులలో పోలవరం కాంట్రాక్టు కంటే ఎక్కువ కమిషన్లు వస్తాయని అన్నారు.  దుర్గ గుడిలో కొనుగోలు చేసిన సరుకులను పరిశీలించాలని డిమాండ్ చేశారు.

సరుకుల కొనుగోళ్లలో వాటాలు పంచుకున్నారని ఏసిబి స్పష్టం చేసిందని, కొండపై సరుకులను నాలుగు సంస్థలు మాత్రమే ఎందుకు సప్లై చేస్తున్నాయని అడిగారు. ఎండోమెంట్ అనుమతి లేకుండా 50కోట్లతో సరుకులు ఎలా కొనుగోలు చేశారన్నారు.

ఎటువంటి గ్యారెంటీ  లేకుండా కోట్లాది రూపాయలను అడ్వాన్సుల కింద ఈఓ ఎలా ఇస్తారని సూటి ప్రశ్న వేశారు. అంతేకాదు మంత్రి వెల్లంపల్లి అపాయింట్మెంట్ ఇస్తే వినతిపత్రం ఇస్తానని చెప్పుకొచ్చారు.