విజయవాడ హైవేలో హైడ్రామా.. మంగళగిరి కార్యాలయానికి చేరుకున్న జనసేనాని..
జనసేనాని పవన్ కల్యాణ్‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా చివరికి మూడు వాహనాలతో విజయవాడ వెళ్లేందుకు అనుమతి పొందారు. అర్ధరాత్రి తర్వాత తన కాన్వాయ్‌తో విజయవాడ చేరుకున్నారు.

అధినేత చంద్రబాబు అరెస్టు పరిణామం నేపథ్యంలో ఆయన్ను కలవడానికి వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులోని గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరి కార్యాలయానికి వెళ్లి తీరుతానని జనసేనాని పట్టుబట్టుకుని కూర్చోవడంతో కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. కానీ, అక్కడి పరిస్థితులు విషమించారు.
ఈ క్రమంలో పోలీసులకు జనసేనాని కార్యకర్తలకు మధ్య ఉద్రికత్త నెలకొంది. చర్చల అనంతరం పవన్ ను పోలీసులు 3 వాహనాల్లో విజయవాడకు అనుమతించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయికి పోలీసు సెక్యూరిటీ గా వచ్చి.. మంగళగిరి కార్యాలయానికి ఆయన్ని తరలించారు. దారిపొడవునా జనసైనికులు, వీర మహిళలు రక్షణ వలయంగా వెంట వచ్చారు. ఇలా అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి తర్వాత విజయవాడ చేరుకున్నారు.
ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓ క్రిమినల్ చేతిలో రాష్ట్ర అధికారం ఉండడం దురదృష్టకరమన్నారు. తాను క్రిమినల్ కావడంతో మిగితావారందరూ క్రిమినల్ అవ్వాలని కోరుకుంటారంటూ మండిపడ్డారు. విదేశీలకు వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకునే క్రిమినల్ జగన్ చేతిలో అధికారం ఉండటం దురదృష్టకరమని అన్నారు. రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. ప్రత్యేక విమానంలో వెళ్తానంటే అనుమతి ఇవ్వలేదని...కారులో వెళ్తామంటే అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. విశాఖలో కూడా ఇలాగే చేశారని.. దోపిడీ చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందన్నారు.
హైవేపై ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఏపీ అట్టుడికింది. నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చంద్రబాబును కలిసేందుకు బయల్దేరిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురుదెబ్బ తగిలింది.ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోజు మార్గంలో విజయవాడకు బయలు దేరారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోని జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద పోలీసులు పవన్‌ని అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల వైఖరికి నిరసనగా జనసైనికులు నిరసనకు దిగడంతో పోలీసులు లాఠీ చార్జీకి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే.. వీసా, పాస్‌పోర్టు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అక్కడే రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు. క్రమంగా అక్కడి పరిస్తితి ఉద్రితక్తంగా మారింది.