మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏపీ నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభినందించారు.

బుధవారం రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద రాపాక పుష్ప గుచ్ఛాలతో కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో పక్కనే వున్న మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను అభినందించారు.

Also Read:14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు: నాడు జడ్పీ ఛైర్మెన్‌గా, నేడు మంత్రిగా వేణుగోపాల్ ప్రమాణం

ఈ సందర్భంగా ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు జగన్ అని కొనియాడారు.

ఇద్దరు బీసీ నేతలను రాజ్యసభకు పంపారన్న కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ధర్మాన అన్నారు.

వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారని నూతన మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.