అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఆయా జిల్లాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరుతూ జనసేన నాయకులు ఆరోపించారు. 

కృష్ణా, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలలో రౌడీమూకలు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయే అవకాశం ఉందని ఆరోపిస్తూ జనసేన నేత మాదాసు గంగాధర్ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. 

నాలుగు జిల్లాలలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలని కోరారు. అలాగే  కౌంటింగ్, ఫలితాల ప్రకటనలపై వస్తున్న ఫుకార్లను కూడా నివృత్తి చేయాలని కోరినట్లు స్పష్టం చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గోపాలకృష్ణ ద్వివేది హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కౌంటింగ్ సజావుగా సాగేందుకు జనసేన సహకరిస్తుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌ను జనసేన పట్టించుకోదన్నారు. మార్పు కోసం పోటీ చేసిన జనసేనకు ఎమ్మెల్యే సీట్ల కంటే ప్రజల ఓట్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. మార్పుకు ఈ ఎన్నికలు నాంది పలికాయని తెలిపారు. సామాన్యులకు టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీయేనని మాదాసు గంగాధర్ తెలిపారు.