రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. జనసేన పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆపార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

వైయస్ జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో త్వరలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు ఆకుల సత్యనారాయణ. 

అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ నై అనడంతో ఆయన జనసేన పార్టీలోకి చేరిపోయారు. ఎమ్మెల్యే పదవి ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి మరీ జనసేన గూటికి చేరారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

జనసేన పార్టీలో రాజమహేంద్రవరం ఎంపీగా ఆయన, రాజమండ్రి అర్బన్ అభ్యర్థిగా ఆయన భార్యను బరిలో నిలుపుదామని ప్రయత్నించారు. అయితే అది బెడిసి కొట్టింది. ఇకపోతే ఆ ఎన్నికల్లో ఆకుల సత్యనారాయణ భార్య సైతం చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. 

అయితే ఊహించని రీతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు ఆకుల సత్యనారాయణ. తిరిగి బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో కాస్త స్నేహంగా ఉండేవారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరేదానికన్నా వైసీపీలో చేరడమే మంచిదని భావిస్తున్నారు. స్థానికంగా నిలదొక్కుకోవాలంటే అందుకు వైసీపీయే కరెక్ట్ అని ఆయన అభిమానులు కార్యకర్తలు సైతం సూచించడంతో ఆకుల సత్యనారాయణ వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారట. 

ఆకుల సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఒకరు. కాపు రిజర్వేషన్ల కోసం, కాపులకు న్యాయం చేసే అంశంలో అసెంబ్లీ వేదికగా పలుమార్లు పోరాటం చేశారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు.

 తాజాగా ఆకుల సత్యనారాయణ చేరుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో నూతనుత్తేజం నెలకొంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు క్యూ కట్టడంతో ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి కాస్త కలిసొచ్చే అంశంగా పార్టీ భావిస్తోంది.