పంచాయతీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైసీపీ కార్యకర్తల అరాచకాలపై జనసేన పార్టీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ .. డీజీపీకి ఫిర్యాదు లేఖ అందించారు. 

అందులో ఏముందంటే.. ‘‘ పంచాయతీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత, అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్న పురపాలక సంఘం ఎన్నికల వేళ, అధికార పార్టీ వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కార్యకర్తలు, మరియు నాయకులు, స్థానిక ఎమ్మెల్యేల దన్నుతో, జనసేన మద్దతుదారులు, కార్యకర్తలను ఘోరమైన రీతిలో బెదిరిస్తూ.. భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నర విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాము. ఇలాంటి కొన్ని ఘటనల వివరాలను దిగువ పొందుపరిచాము. 

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన మత్స్యపురి గ్రామంలో, షెడ్యూలు కులాలకు చెందిన మహిళా అభ్యర్థి శ్రీమతి శాంతి ప్రియ, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, జనసేన పార్టీ మద్దతుతో సర్పంచ్ గా గెలిచారు. ఎన్నికల తర్వాత, ఆమె డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లగా, స్థానిక వైఎస్సార్సీ పార్టీ మద్దతుదారులు, గ్రామంలో, ఆమెను అడ్డుకున్నారు. తర్వాత, బయటి వ్యక్తులతోపాటు, భీమవరం ఎమ్మెల్యే ప్రత్యక్ష అండ చూసుకుని, వాళ్లు, ఎన్నికైన సర్పంచ్ ఇంటికి వెళ్లి, ఆమెను ఆమె మద్దతుదారులను, గాలించి..  దాడి చేసి, బండబూతులు తిట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని, మా కార్యకర్తలు  స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఏ చర్యా తీసుకోలేదు. పైగా, వైఎస్సార్సీపీ మద్దతుదారులు చేసిన కౌంటర్ ఫిర్యాదుపై, పోలీసులు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

గుంటూరు జిల్లా సత్తెన పల్లి అసెంబ్లీ, ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో, పంచాయతీ ఎన్నికలకు ఓ రోజు ముందు.. అంటే 20-02-2021, శనివారం ఉదయం, అధికార పార్టీ మద్దతుదారులు, 7వ వార్డులో ఓట్లను కొనేందుకు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. జనసేన పార్టీ మద్దతుదారులు అధికార పార్టీ కార్యకర్తల చర్యలను అభ్యంతర పెట్టారు. వాళ్లను ఆపేందుకు ప్రయత్నించగా.. వాళ్లు రాళ్లు రువ్వి, విచక్షణారహితంగా జనసేన పార్టీ మద్దతుదారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో నల్లపల్లి వేంకటేశ్వర్లు ఎముకలు విరిగాయి. సూరంశెట్టి సతీశ్ ఎడమ కంటికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనలో వీరితోపాటే చాలామంది ఇతరులు కూడా  గాయపడ్డారు. 

తూర్పుగోదావరి జిల్లాలో, అమలాపురం నియోజకవర్గం, బెండమూర్లంక గ్రామంలో, అధికార పార్టీ కార్యకర్తలు మా కార్యకర్తలపై దాడి చేశారు. పి.గన్నవరం నియోజకవర్గం, లంకలగన్నవరం గ్రామంలో, ఎన్నికల తర్వాత, ప్రతీకార చర్యగా, రైతులకు ఉపయోగపడే మార్గాన్ని తవ్విపారేశారు. 

వైఎస్సార్సీ పార్టీ మద్దతుదారులు, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థల గురించిన భయమేమీ లేకుండా,  జనసేన పార్టీ మద్దతుదారులతో పాటు ఇతరులపై కూడా బాహాటంగానే భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయింది. ఈ ఘటనలకు సంబంధించి మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారన జనసేన పార్టీ విశ్వసిస్తోంది. 

అలాగే, అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తులపై మీరు తక్షణ చర్యలు తీసుకోవాలనీ జనసేన పార్టీ కోరుతోంది. మా పార్టీ కార్యకర్తలు, నాయకుల భద్రతకు హామీ ఇవ్వగలరని, మా పార్టీ తరపున మిమ్మల్ని కోరుతున్నామని’’ జనసేన పేర్కొంది.