Asianet News TeluguAsianet News Telugu

పౌరులూ యాప్ సిద్ధం చేస్తారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేస్తారు.. పవన్ కల్యాణ్..

ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్ ఆధారిత హాజరు విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలాంటి యాప్ తయారు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. 

janasena leader pawan kalyan tweet on teachers attendance app in AP
Author
Hyderabad, First Published Aug 18, 2022, 8:36 AM IST

అమరావతి : ‘ఉపాధ్యాయులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందరూ అందులో హాజరు నమోదు చేయాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తోంది. అదే తరహాలో పౌరులు కూడా ఒక యాప్ సిద్ధం చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా అది ఉంటుంది. బాధ్యత ఎప్పుడూ ఒకరికి ఉండకూడదు. అందరికీ అది ఉండాలి’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

దీనికి ఒక కార్టూన్ కూడా జోడించారు. ఉపాధ్యాయులు సిగ్నల్ కోసం అటు, ఇటు తిరుగుతున్నట్లుగా ఆ కార్టూన్ లో ఉంటుంది. అందులో స్కూల్ అటెండర్ మాట్లాడుతూ..‘ పాపం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పే వాళ్ళు.. అదేదో యాప్ అట.. దాని సిగ్నల్ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు తిరుగుతున్నారు సార్’  అని వేరే ఎవరికో చెబుతున్నట్లు ఉంది. 

అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం.. రాజకీయంగా ఎదుర్కొలేకే కులం రంగు పులుముతున్నారు: పవన్ కల్యాణ్

ఇదిలా ఉండగా,  ఏపీ లో మంగళవారం నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్ ఆధారిత హాజరు విధానం అమల్లోకి వచ్చింది. ఈ యాప్ ఆధారిత హాజరు విషయమై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటలలోపు ఉపాధ్యాయులు స్కూల్ కు హాజరు కావాలి. స్కూల్ కు హాజరైన వెంటనే ఫేస్ రికగ్నైజేషన్ తో పాటు ఫోటోను కూడా విద్యాశాఖ సూచించిన యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించింది.

స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయులు వెంటనే ఈ యాప్ లో లాగిన్ కావాలని విద్యా శాఖ కోరింది. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా కూడా సగం వేతనం కట్ చేస్తామని విద్యా శాఖ తేల్చి చెప్పింది. ఈ యాప్ ఆధారంగానే ఉపాధ్యాయుల హాజరును విద్యాశాఖ పరిగణించనుంది. అయితే స్మార్ట్ఫోన్లు లేని ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

విద్యాశాఖ సూచించిన యాప్ ను ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకున్నా కూడా టెక్నికల్ సమస్యలతో ఈ యాప్ పనిచేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మిడ్ డే  మీల్స్ తో పాటు ఇతర విషయాలపై అప్పులను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచే క్రమంలోనే ఈ తరహా విధానాన్ని అమలు చేసిందని ఏపిటిఎఫ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వమే బయోమెట్రిక్ ను స్కూల్లో ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కూడా ఉపాధ్యాయులు కోరుతున్నారు. స్మార్ట్ఫోన్లలో ఈ తరహాలో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని హాజరు నమోదు చేసుకోవాలని కోరడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఈ అప్ డౌన్లోడ్ చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులను కోరుతున్నాయి. అయినా కొందరు ఉపాధ్యాయులు యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే సాంకేతిక సమస్యలు వస్తున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యార్థుల హాజరుపై కూడా యాప్ను కొనసాగిస్తున్న విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios