ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ సినియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మొత్తం 175 స్థానాల్లోనూ జనసేన పార్టీ తరపున బలమైన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతకే ఎక్కువ అవకాశాలిచ్చి ప్రోత్సహించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్దంగా ఉన్నారని నాదెండ్ల ప్రకటించారు. 

విజయ నగరం జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నాదెండ్ల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ... పార్టీని క్షేత్ర స్థాయిలోని సామాన్యుల వద్దకు తీసుకెళ్లెందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. వాటిని విజయవంతంగా నిర్వహించి ప్రజలకు జనసేన పార్టీని మరింత చేరువ చేసేందుకు నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన విషయాన్ని నాదుండ్ల గుర్తుచేశారు. ఈ గుర్తును కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేలా కార్యక్రమాలు రూపొందించాలని నాయకులకు సూచించారు. అందుకోసం ఆదునిక టెక్నాలజి, సోషల్ మీడియా మాద్యమాలను వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. 

ఇప్పుడు కష్టపడిన ప్రతి ఒక్కరికి భవిష్యత్ లో మంచి అవకాశాలుంటాయని నాదెండ్ల పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తీర్చడంలో అధికార టిడిపి, వాటిపై పోరాడటంలొ ప్రతిపక్ష వైసిపి పార్టీలు విపలమయ్యాయని...జనసేన ఒక్కటే ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ అని నాదెండ్ల ప్రశంసించారు.