ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగా.. ఇప్పుడే రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగా.. ఇప్పుడే రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. మరోవైపు పొత్తులు, రాజకీయ సమీకరణాలపై జోరుగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12న యువశక్తి పేరుతో నిర్వహించనున్న కార్యక్రమం గోడపత్రికను నాదెండ్ల మనోహర్ ఆదివారం ఆవిష్కరించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి 14న ఇప్పటం గ్రామంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్ కోసం అంతా కలిసికట్టుగా రావాలని సూచించారని గుర్తుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కూడా చెప్పారని తెలిపారు. ఆ మేరకు రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత.. ఎన్నికలకు ఎలా సిద్దం కాబోతున్నామో పారదర్శకంగా తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల్లో పొత్తులపై త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపారు. 

నాటి జగనన్న నేటి మోసమన్న అయిపోయాడని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఉత్తర కోస్తా ఆంధ్ర సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తాము యువశక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరవుతారని తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర వెనుకబాటుతనంపై జనసేన దృష్టి సారించిందని చెప్పారు. ఇందులో భాగంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దేందుకు జనసేన యువశక్తి తదితర కార్యక్రమాలను నిర్వహించనుందని తెలిపారు. 

వెనుకబడిన ప్రాంత ప్రజల వలసలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలను యువశక్తిలో పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తారని చెప్పారు. యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గ్రామ సారథుల నియామకం చేపట్టడాన్ని నాదెండ్ల మనోహర్ ఖండించారు. గ్రామ సారథుల నియామకం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 

ఇక, ప్రస్తుతం బీజేపీతో జనసేత పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పొత్తులో ఉన్నమాటే కానీ.. బీజేపీ, జనసేల మధ్య క్షేత్రస్థాయిలో ఆ విధమైన సఖ్యత కనిపించడం లేదు. మరోవైపు బీజేపీ తీరుపై కూడా పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ విశాఖ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించడంతో.. టీడీపీ, జనసేనల పొత్తుపై చర్చ సాగింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తాము ప్రస్తుతానికి బీజేపీతోనే పొత్తులో ఉన్నామని చెప్పారు. 

ఇక, ఇటీవల విశాఖపట్నంలో ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు.