సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఆసక్తి రేపుతున్నాయి. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూనే వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేస్తోంది ఆ పార్టీ. 

ఎన్నికలకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, నిధుల సమీకరణ , మేనిఫెస్టో, ప్రచార వ్యూహాలపై బిజీగా వున్నాయి. అధికార వైసీపీలో ఇప్పటికే ఇన్‌ఛార్జ్‌ల మార్పు వ్యవహారం కాకరేపుతోంది. గెలవరని తేలిన నేతలను జగన్ నిర్ధాక్షిణ్యంగా పక్కనపెట్టేస్తున్నారు. ఆ పార్టీలో టికెట్లు దక్కని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అటు టీడీపీ, జనసేన కూటమి సైతం ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. సీట్ల కేటాయింపు, ఉమ్మడి మేనిఫెస్టోపై ఈ నెలాఖరు నాటికి క్లారిటీ వచ్చే అవకాశం వుంది. 

ఇదిలావుండగా .. సంక్రాంతి పండుగ కావడంతో పట్నవాసి పల్లెబాట పట్టాడు. తెలుగువారి పెద్ద పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అయినవాళ్ల మధ్య జరుపుకోవడానికి ప్రజలు నగరాల నుంచి స్వగ్రామాలకు బయల్దేరారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి రద్దీగా మారింది. టోల్‌గేట్ల వద్ద వేలాది వాహనాలు బారులు తీరుతున్నాయి. మరోవైపు.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఆసక్తి రేపుతున్నాయి. 

సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూనే వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేస్తోంది ఆ పార్టీ. ఏపీలో రోడ్లు సరిగా లేవని, జాగ్రత్తగా వెళ్లాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సొంతూరికొచ్చే సంతోషంలో కారు జోరు పెంచొద్దు, ఏపీ రోడ్లు బ్రేకులు వేస్తాయి అంటూ జనసేన నేతలు సెటైర్లు వేస్తున్నారు.