అమరావతి: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నష్టపోకూడదనేది తాము తొలి నుండి చెబుతున్నామని జనసేన పార్టీ మరోసారి పునరుద్ఘాటించింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రాజధాని గ్రామాల్లో భూ కుంభకోణాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. కానీ ఈ కుంభకోణాలపై విచారించి బాధ్యులను శిక్షించాలని కోరుతోంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టం చేయవద్దని ఆ పార్టీ కోరింది.

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఆదివారం  నాడు జరిగింది. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ , నాదెండ్ల మనోహర్,,కె.నాగబాబు,తోట చంద్ర శేఖర్, పి.ఏ.సి. సభ్యులు పాల్గొన్నారు.

రాజధాని తరలింపు వ్యక్తిగతంగా  ఎజెండా మేరకు తీసుకొన్న నిర్ణయంగా ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేత మనోహార్ చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపోకూడదనేది తమ పార్టీ అభిప్రాయమన్నారు. 

మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల నుండి ఆమోదం లేదని ఆ పార్టీ  నేత చంద్రశేఖర్ టెలి కాన్ఫరెన్స్ లో తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ విషయమై న్యాయపరమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసా ఇస్తారని 2015లోనే తమ పార్టీ ప్రశ్నించిన విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. 

చంద్రబాబు, వైఎస్ జగన్ పర్సనల్ ఎజెండాతో పని చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ విమర్శలు చేస్తోంది. రాజధాని రైతులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతుగా ఆయన ఆందోళనలు చేశారు. అయితే పాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీ ఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.