అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను స్వయంగా గాని లేదా రాతపూర్వకంగా గానీ, మెయిల్ ద్వారా గానీ తెలియచేయటానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని జనసేన తెలిపింది. అందువల్లే జనసేన పార్టీ అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా తెలియచేయమని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచించారని... ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి  రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి ఈ-మెయిల్ ద్వారా పార్టీ అభిప్రాయాన్ని తెలియచేసినట్లు ప్రకటించింది. 

''స్థానిక సంస్థల సాధికారత, బలోపేతం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగ విలువలను గౌరవిస్తాం. ఆ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటాం'' అని జనసేన ఎస్ఈసీకి తెలిపినట్లు వెల్లడించింది. 

''ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత ఎన్నికల కమిషన్ ఈ యేడాది ఆగస్టులో ఎన్నికల నిర్వహణకు రూపొందించిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరుతోంది'' అన్నారు. 

READ MORE  నిమ్మగడ్డతో బేటీ: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సీఎస్ నీలం సాహ్ని

''అదే విధంగా 2020 మార్చి నెలలో సాగిన ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేసిన అవకతవకలు, భారీ హింసపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి మరోమారు తీసుకువస్తున్నాం'' అని జనసేన పార్టీ మీడియా విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇక గతంలోని ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఎస్ఈసీ ని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ, జనతాదళ్, ముస్లిం లీగ్ పార్టీలు కూడా కోరినట్లు తెలుస్తోంది. ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని సీపీఎం సూచించింది. అలాగే నిక సంస్థల ఎన్నికలపై ఎస్‍ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామన్న సమాజ్‍వాదీ పార్టీ తెలిపింది.