జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత రెండు రోజులుగా  విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో బస చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కాసేపట్లో ఆయన విజయవాడ బయలుదేరనున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ చేరుకుంటారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో విజయవాడ బయలుదేరనున్నారు. పవన్ కల్యాణ్ గత రెండు రోజులుగా విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో బస చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం పార్టీ శ్రేణులతో సమావేశమైన పవన్ కల్యాణ్‌ భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనంతరం విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు సాయంత్రం పవన్ కల్యాణ్‌ విజయవాడకు చేరుకోనున్నారు. రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ను పవన్ కల్యాణ్ కలిసే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేనకు గవర్నర్ అపాయింట్‌మెంట్ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది. 

విజయవాడ చేరుకున్న అనంతరం.. పవన్ కల్యాణ్‌ ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేసే అవకాశం ఉంది. రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ లభిస్తే.. తన విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను వివరించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ విశాఖ నుంచి బయలుదేరాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన నోవాటెల్‌ హోటల్ నుంచి ఎయిర్‌పోర్టు‌ చేరుకునేందుకు రూట్ మ్యాప్‌ను రూపొందించారు. ఆ మార్గంతో బందోబస్తుతో పాటు, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఇక, విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నారు. 

ఇక, విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. పవన్ కల్యాణ్వి శాఖలో నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో శనివారం నాడు మంత్రులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల కాన్వాయ్‌లపై దాడికి పాల్పడిన ఘటనకు పవన్‌ కల్యాణ్‌ కారణమని నోటీసులో పేర్కొన్నారు.

అయితే ఈ నోటీసును మీడియాకు చూపించిన పవన్ కల్యాణ్.. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారని అన్నారు. తాము విశాఖపట్నం రాకముందే దాడి జరిగిందని.. కానీ తాము రెచ్చగొట్టడం వల్లే ఆ ఘటన జరిగిందని నోటీసులు ఇచ్చారని చెప్పారు. నేరపూరిత రాజకీయాలపై పోరాటంలో కేసులు ఎదుర్కొనేందుకు , జైలుకు వెళ్లేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు.. అది సుదీర్ఘ పోరాటమని తనకు బాగా తెలుసునని అన్నారు.

మరోవైపు విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులపై దాడి ఘటనలో అరెస్టైన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. అరెస్టైన 61 మందిని రూ. పదివేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మరో తొమ్మిదిమందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. తొమ్మిది మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించారు. అంతకు ముందు హైడ్రామా మధ్య పోలీసులు జనసేన నేతలను ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 

వారిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు మరోవైపు 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని, 61మంది జనసైనికులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.