విజయవాడ: ఏపీలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మూడు రోజులపాటు పార్టీ సమీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. 

ఈనెల 29 నుంచి 31 వరకు  పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. 

ఈనెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, వివిధ కమిటీ సభ్యులతో పవన్ చర్చించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో భేటీ కానున్నారు. 

30 ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, సాయంత్రం 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో సమావేశం కానున్నారు. ఇకపోతే 31 ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు.