విజయవాడ: 2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైరన్ మోగించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తుకు పవన్  కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బయోడేటా సమర్పించారు. 

ఇటీవలే పవన్ కళ్యాణ్ నియమించిన ఐదుగురు సభ్యుల స్క్రీనింగ్ కమిటీకి తన బయోడేటాను సమర్పించారు. పవన్ కళ్యాణ్ పోటీపై రాజకీయ వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. 

రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావాహుల నుంచి బయోడేటాలు సేకరించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్క్రీనింగ్ ఎంపికకు సంబంధించి రాజకీయ వ్యవహారాల కమిటీతో కలిసి పలు సూచనలు చేశారు.  

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాదాసు గంగాధరం నేతృత్వంలోని ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి ఆశావాహులు తమ బయోడేటాను సమర్పించాలని ఆ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైందన్నారు. 

2009 ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా నీతి, నిబద్ధతగా ఉన్న వ్యక్తులను ఎంపిక చెయ్యాలని సూచించారు. ఆశావాహులు కూడా పక్క మార్గాల నుంచి కాకుండా నేరుగా ఐదుగురు సభ్యుల ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి మాత్రమే బయోడేటా ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్.