కూల్చివేతలతో మొదలెట్టిన వాళ్లు, కూల్చివేతలతోనే అంతమవుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అమరావతి ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇక్కడి నుంచి కదలదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తారని, వీళ్లకు జనం అంటే ఏమాత్రం లెక్కలేదన్నారు. సచివాలయ ఉద్యోగులు సైతం ప్రజలకు అండగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.

Also Read:జగన్ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోను, పతనం ప్రారంభం : పవన్ కళ్యాణ్

రాజకీయ నాయకులను, వ్యవస్థను నమ్మొద్దని ప్రభుత్వాలు మారతాయి కానీ ఉద్యోగస్థులు మాత్రం శాశ్వతమన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి సచివాలయ ఉద్యోగి రోడ్ల మీదకు వచ్చి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడారని పవన్ గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం మతం, కులం, ప్రాంతాలవారీగా విడిపోయి ఉన్నారని జనసేనాని వెల్లడించారు. ఎవరైనా వస్తే శంకుస్థాపనలతో పని మొదలుపెడతారని.. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రావడం రావడమే కూల్చివేతతో మొదలెట్టిందని పవన్ ఎద్దేవా చేశారు. 

తెలుగుదేశం పార్టీ 33 వేల ఎకరాలు కావాలంటే తాను విభేదించానని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతే ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని అన్నారు.

Also Read:మేకులున్న లాఠీలతో కొట్టారు.. పోలీసుల ముసుగులో వాళ్లపనే: పవన్ వ్యాఖ్యలు

రెండు చోట్లా తనను ఓడించినా ఇంత బలంగా నిలబడటానికి కారణం ప్రజలంటే తనకు ఇష్టమన్నారు. వైసీపీ నాయకులకు కావాల్సింది గొడవని, పోలీసులు.. జనం ముసుగులో మనపై దాడులు చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోవచ్చుని అయితే మళ్లీ తిరిగి ఒక రాజధానిగా చేసే బాధ్యత తనదేనన్నారు. రెండున్నరేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయని.. 151 కాదు కదా.. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే లేకుండా చేయాలని పవన్ పిలుపునిచ్చారు. తాను అవకాశవాద రాజకీయాలు చేయనని, ప్రజలకు మన:శాంతి కలిగించే రాజకీయాలే చేస్తానని జనసేనాని వెల్లడించారు.