ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జగనన్న విద్యాకానుక’ పథకంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే ‘మోదీ-జగనన్న విద్యా కానుక’ అనడం సమంజసమన్నారు.

ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మాత్రమే భరిస్తోందని పవన్ చెప్పారు. విద్యార్థుల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులు, తదితరాలకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులు వెచ్చిస్తోందంటూ పవన్ ట్వీట్‌ చేశారు.

కేంద్రం, రాష్ట్రం దేనికెంతెంత ఖర్చు చేస్తోందో సంబంధిత వివరాలను పవన్ సదరు ట్వీట్‌లో పొందుపరిచారు. కాగా ఈ పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతోందంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్ వివరాలతో సహా ట్వీట్‌ చేయడం గమనార్హం. విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక’ పథకాన్నికృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు.  చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు.

నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామని జగన్ పేర్కొన్నారు. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నాం. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.