Asianet News TeluguAsianet News Telugu

ఒంటరిగా వెళ్లి వీరమరణాలొద్దు..కానీ కండీషన్స్ అప్లయ్, పొత్తులపై తేల్చేసిన పవన్ కల్యాణ్

2024 ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. గౌరవం తగ్గకుండా , మనం లొంగిపోకుండా కుదిరితే చేస్తాం.. లేదా ఒంటరిగానే వెళ్తామని పొత్తులపై ఆయన తేల్చేశారు.

janasena chief pawan kalyan sensational comments on alliance with tdp
Author
First Published Jan 12, 2023, 8:33 PM IST

ఒంటరిగా వెళ్లిపోయి వీర మరణాలు అక్కర్లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరి వుండి గెలుస్తానంటే తనకు ఎవరి పొత్తులు అక్కర్లేదని.. మీరు అండగా వుంటానని గ్యారెంటీ ఇస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఇప్పుడు ఓకే అని చెప్పి ఎన్నికలు అవ్వగానే మా వాడు, మా కులం అని అంటే కుదరదని ఆయన తేల్చిచెప్పారు. తాను మిమ్మల్ని కుటుంబం అనుకున్నానని.. తన ఫ్యామిలీయే వదిలేస్తే తాను ఏం చేయాలని పవన్ ప్రశ్నించారు. కొన్నిసార్లు ప్రత్యర్ధులని కూడా కలుపుకునిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరినీ హింసించే ఒక్కడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలని పవన్ అన్నారు. గౌరవం తగ్గకుండా , మనం లొంగిపోకుండా కుదిరితే చేస్తాం.. లేదా ఒంటరిగానే వెళ్తామని పొత్తులపై ఆయన తేల్చేశారు. ఓడిపోతే ఇంట్లో కూర్చొన్నాం.. బయటికొచ్చాం తిరిగామని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయం ఎంత సేపటికీ రెడ్డి, కమ్మ, కాపు కులాల చుట్టూనే తిరుగుతున్నాయని.. ఇంకా ఎన్నో కులాలు వున్నాయని ఆయన తెలిపారు. 

చంద్రబాబును తాను కలిస్తే బేరాలు కుదిరిపోయాయని వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు డబ్బుపై మమకారం లేదని.. ఏడాదికి 25 కోట్ల ట్యాక్స్‌లు కడుతున్నానని ఆయన తెలిపారు. విశాఖలో పోలీసులు తనను వేధిస్తే.. చంద్రబాబు తన కోసం వచ్చి నిలబడ్డారని పవన్ తెలిపారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లి సంఘీభావం ప్రకటించానని ఆయన చెప్పారు. రెండున్నర గంటల పాటు ఏం కూర్చొని మాట్లాడుకున్నారంటూ అడుగుతున్నారని.. దానికి ఆన్సర్ ఇస్తానని పవన్ తెలిపారు. తొలి పది నిమిషాలు కుశల ప్రశ్నలు వేశారని.. 11వ నిమిషం నుంచి పది నిమిషాల పాటు పోలవరం చూసే సంబరాల రాంబాబు గురించి మాట్లాడామని మంత్రి అంబటి రాంబాబు గురించి మాట్లాడుకున్నామని పవన్ సెటైర్లు వేశారు. 

ALso REad: నీ బాగోతాలన్నీ తెలుసు.. ఖైదీ నెం 6093కి సెల్యూట్ కొట్టలేను, నేనే పోలీస్‌నైతే చచ్చిపోతా : జగన్‌పై పవన్ వ్యాఖలు

సన్నాసి ఐటీ మినిస్టర్ రాష్ట్రాన్ని 15వ స్థానంలో పెట్టేశాడని 18 నిమిషాల పాటు మాట్లాడుకున్నామన్నారు. లా అండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది .. ఏం చేయాలన్న దానిపై 38 నిమిషాలు మాట్లాడుకున్నామని పవన్ తెలిపారు. మాట్లాడేకొద్ది కేసులు వస్తూనే వున్నాయని.. అలా గంటన్నర అయిపోయిందని జనసేనాని సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎలా వుండాలన్న దానిపై తర్వాత మాట్లాడుకున్నామని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పానని పవన్ అన్నారు. వైసీపీ అద్భుత పాలన అందించి వుంటే తాను గొంతెత్తేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. 

తాము ఫ్యాక్షనిస్టులం , బాంబులేస్తామని అంటే తాము చూస్తూ ఊరుకుంటామా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పోలీసుల్ని పెట్టి తన్నిస్తే.. తన్నించుకుంటామా అని ఆయన నిలదీశారు. వైసీపీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో కనిపిస్తే తాను నమస్కారం పెడతానని ఎందుకంటే అది తన సంస్కారమని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. సీట్లు, పొత్తుల గురించి తాను చంద్రబాబుతో మాట్లాడలేదని పవన్ పేర్కొన్నారు. 

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ సైకో మాటలు ఎలా వింటున్నారో తనకు అర్ధం కావడం లేదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ అవినీతి పాలన చూశారని, ఇకపై నిజాయితీ పాలన చూడాలని ఆయన కోరారు. అధికారం ఇస్తే సేవకుడిగా పనిచేస్తానని, లేదంటే మీ కోసం నిలబడే వుంటానని పవన్ స్పష్టం చేశారు. తాను తలుచుకుంటే ఏడాదికి రూ.250 కోట్లు సంపాదిస్తానని.. కానీ తనకు కోట్ల కంటే మీ కోట్లాది జీవితాలే ముఖ్యమని జనసేనాని తెలిపారు. అడ్డదారులు తొక్కడం ఇష్టం లేకే పార్టీని నడపటం కోసం సినిమాలు చేస్తున్నానని పవన్ వెల్లడించారు. గత ఎన్నికల్లో 53 సీట్లలో 6.9 శాతం ఓట్లు జనసేనకు వచ్చాయని ఆయన తెలిపారు. వైసీపీ టెక్నికల్‌గానే గెలిచిందని.. అందుకే ఈసారి ఓట్లు చీలకూడదని అంటున్నానని పవన్ వెల్లడించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios