Asianet News TeluguAsianet News Telugu

అంతర్వేది ఘటన యాధృచ్ఛికం కాదు...ఉగ్రవాద కోణంలో విచారణ: పవన్ కల్యాణ్ డిమాండ్

దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.  

janasena  chief pawan kalyan reacts antarvedi chariot catches fire
Author
Amaravathi, First Published Sep 8, 2020, 8:55 PM IST

అమరావతి: దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.   అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన వివాదం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం గురించి ఖచ్చితంగా మాట్లాడాలని అన్నారు.  ఇది ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమేనని మండిపడ్డారు. 

''హిందూ మతం విషయంలో ఎందుకు స్పందించరు? ప్రార్ధనా మందిరాలను అంటే ఏ మత ప్రార్ధనా మందిరాలను అయినా సరే ఇలా అపవిత్రం చేస్తే అందరూ ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించిగానీ, హిందూ మతానికి సంబంధించిగానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారు అన్న ఒక భావజాలాన్ని ప్రవేశ పెట్టారు. ఇది చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులనేవి ప్రతి ఒక్కరికీ సమానం. ఏ మతానికి కానీ , ఏ కులానికి  చెందిన వారైనా అందరికీ సమానంగా ఇచ్చారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంత మందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా'' అన్నారు. 

''ప్రస్తుతం మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయాయి. హిందూ ధర్మాన్ని వెనుకేసుకొస్తే నువ్వు లౌకికవాదివి కాదు అంటారు. హిందూ ధర్మంపై  దాడి జరిగినప్పుడు ఖండిస్తే నువ్వు సెక్యులర్ వాదివి కాదు అంటారు. మరే మతం మీద దాడి జరిగినా విగ్రహాలను పాడు చేసినా, ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసినా... నువ్వు గొంతేసుకుని నిలబడితేనే సెక్యులర్ వాదివి. ఇలాంటి మౌఢ్యంతో కూడిన పడికట్టు భావజాలాలు పెరిగిపోతూ ఉన్నాయి'' అని పేర్కొన్నారు. 

read more రాష్ట్రానికి అరిష్టం... అంతర్వేది రథం దగ్దంపై సిబిఐ విచారణ: నారా లోకేష్
 
''అంతర్వేది రథం దగ్దం ఒక సంఘటనో రెండు సంఘటనలో అయితే చిన్న స్థాయిలో స్పందించి వదిలేసేవాడిని. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే మౌనంగా ఉండలేం. పిఠాపురంలో మొదలయ్యింది. సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన ఊరది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠం అది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసేశారు. అది ఎవరు చేశారు అంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి  చేశాడు అన్నారు. ఆహ...అనుకున్నాం. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. నాకేం అర్ధం కాలేదు. ఓహో ఇలా జరుగుతాయా అనుకున్నా. ఇప్పుడు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథంపైన ఏదో తేనె పట్టు ఉందంట.. ఆ తేనె పట్టుని తీయడం కోసం వీళ్లు తగులపెట్టేశారంట. అలాకాకుండా ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇదీ ఆ జాబితాలో చేర్చారు. యాదృచ్చికంగా జరిగినవంటున్నారు. ఎన్ని జరుగుతాయి యాదృచ్చికంగా..? ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఉగ్రవాద నేపథ్యం ఉందా గొడవలు రేపేసి మతకలహాలు రేపేసి తద్వారా అస్థిరత సృష్టించడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారా? దీని వెనుక ఉగ్రవాదుల చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆ కోణం నుంచి కూడా చూడాలి. జనసేన పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటుంది. ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే దుర్గాదేవి, గణపతి, సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. స్వామి వారిని ఊరేగించే రథాల్ని దగ్ధం చేస్తుంటే... ఏమనుకోవాలి. ఖచ్చితంగా దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందా? సంఘవిద్రోహులెవరైనా ఉన్నారా? లేదంటే రాజకీయ లబ్ది పొందడానికి ఎవరైనా చేస్తున్నారా? వీటన్నింటినీ అన్ని కోణాల్లో చూసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొన్నారు.

''నాణాలు విసిరేస్తే ఏడుకొండలవాడి పింక్ డైమండ్ పగిలిపోయింది. ముక్కలు చెల్లాచెదురైపోయాయి. అలాగే స్వామివారి రథాలు కాలిపోతున్నా, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ఎవరో పిచ్చివాళ్లు చేసిన పని అని చెబుతుంటే స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. తాము చెబుతున్న కారణాలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా లేదా అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. దీని మీద నేను కోరుకునేది ఒకటే. సమగ్ర విచారణ జరపాలి. మీరు చెప్పినట్టు మతిస్థిమితం లేని వాళ్లు అనేది కాకుండా పకడ్బందీ కారణాలతో సాగుతున్నాయా అనే కోణంలో విచారించాలి'' అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.      

 

Follow Us:
Download App:
  • android
  • ios